- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ నిర్వాసితులపై పన్ను పోటు..!
గత ఆరేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మరో సమస్య వచ్చి చేరింది.

దిశ, గజ్వేల్ రూరల్: గత ఆరేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మరో సమస్య వచ్చి చేరింది. ఒక పక్క ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, నష్ట పరిహారాలు రాక, సమస్యలు తీరక, చేసుకుందామంటే ఉపాధి లేక బతుకు వెళ్లదీస్తూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరో పక్క మున్సిపల్ పన్నుల రూపంలో పిడుగులాంటి వార్త వచ్చి చేరడంతో భూ నిర్వాసితులను ఆందోళన కలిగిస్తోంది. 2020 సంవత్సరంలోనే ముంపు గ్రామాలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి తరలించినప్పటికీ 2025 వరకు గ్రామ పంచాయితీలుగానే కొనసాగాయి. ఈ ఏడాది జనవరి 2026లో ముంపు గ్రామాలను అధికారికంగా మున్సిపల్ లో విలీనం చేసినప్పటికీ 2023 నుంచే పన్నులను వసూలు చేయాలని మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తుండటంతో భూ నిర్వాసితులను కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన భూ నిర్వాసితులు శుక్రవారం ఇంటి పన్నుల విషయంలో మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఈ అంశం ఆర్ అండ్ ఆర్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.
2025 వరకు పంచాయితీలుగానే..
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్ వాటి మధిర గ్రామాలను అదే విధంగా కొండపాక మండలం లోని ఎర్రవల్లి, సింగారం ముంపు గ్రామాలను 2020 - 2021 లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్, ముట్రాజ్ పల్లి శివారులో పునరావాస కాలనీని ఏర్పాటు చేసి అక్కడికి తరలించింది. పునరావాస కాలనీలో 4 వేలకు పైచిలుకు ఇల్లు ఉండగా 12 వేలకు పైగా ఓటర్లు ఉండగా 18 వేల వరకు జనాభా ఉన్నారు. ముంపు గ్రామాలను 2020-2021లోనే మున్సిపల్ పరిధిలోకి తరలించినప్పటికీ 2024 ఫిబ్రవరి వరకు సర్పంచుల పాలనలో 2025 వరకు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయితీలుగానే కొనసాగాయి.
మున్సిపల్ వెబ్ సైట్‌లో పన్నుల వివరాలు..
ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పన్నుల వివరాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపరిచారు. ఒక్కో గ్రామానికి ఒక్కో విధంగా ఆబాది ప్రకారంగా పన్నులను నిర్ణయించి పెట్టారు. ఏరియార్ టాక్స్, ఏరియార్ ఇంట్రెస్ట్, కరెంట్ టాక్స్, కరెంట్ ఇంట్రెస్ట్ అన్ని కలుపుకొని అన్ని ముంపు గ్రామాలకు 2023-2024 నుంచి 2025-2026 వరకు కట్టాల్సిన పన్నులను ఆన్లైన్‌లో అప్లోడ్ చేశారు. పునరావాస కాలనీలోని వేములఘాట్ లో కొన్ని ఇళ్లకు ఇంటి పన్నును రూ. 465 లెక్కన రూ.1611 మరికొన్నింటికి రూ.573 లెక్కన రూ.1983 ఇంట్రెస్ట్ తో కలిపి విధించారు. ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాల్లోని కొన్ని ఇళ్లకు ఇంటి పన్ను రూ.636 లెక్కన రూ. 3116 ఇంట్రెస్ట్ తో కలిపి విధించారు. లక్ష్మాపూర్ గ్రామంలోని ఇళ్లకు ఇంటి పన్ను రూ.636 లెక్కన ఇంట్రెస్ట్ తో కలిపి రూ. 4090 విధించారు.అదే విదంగా సింగారం, ఎర్రవల్లి గ్రామాల్లోని ఇళ్లకు ఇంటి పన్ను రూ. 636 లెక్కన ఇంట్రెస్ట్ తో కలిపి రూ. 5142 విధిస్తూ ఆన్లైన్ లో పొందుపరిచారు.
2023 నుంచి పన్నులు ఎలా విదిస్తారు..?
మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నప్పటికీ 2025 వరకు గ్రామ పంచాయతీలుగానే కొనసాగాయని 2023 నుంచి ఇంటి పన్ను ఎలా విధిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 2026 లో అధికారికంగా మున్సిపాలిటీలో విలీనమైన ముంపు గ్రామాలకు 2023 నుంచి పన్ను వసూలు చేయాలనుకోవడం సమంజసం కాదంటున్నారు. గత ఏడాది వరకు మేము గ్రామ పంచాయితీల ద్వారానే సేవలు పొందామని, మున్సిపల్ నుంచి ఎలాంటి సేవలు పొందలేదని అలాంటప్పుడు 2023 నుంచి పన్నులు ఎలా వసూలు చేస్తారని మండిపడుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోయి ఉపాధి లేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టడుతున్నామని మున్సిపల్ పన్నుల నుంచి భూ నిర్వాసితులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
10 సంవత్సరాలు మినహాయింపు ఇవ్వాలి: సీఐటీయూ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు మున్సిపల్ పన్నులను విధించకుండా 10 సంవత్సరాల పాటు మినహాయింపు ఇవ్వాలి. సర్వస్వం కోల్పోయి, పరిహారాలు రాక, ఉపాధి లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బతుకులు ఇప్పటికే అగమ్యగోచరంగా మారాయి. ప్రభుత్వం భూ నిర్వాసితులపై కనికరం చూపాలని కోరారు.
సేవలు అందించకుండా పన్ను ఎలా విధిస్తారు..?: సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ
అధికారికంగా 2026 లో మున్సిపల్ లో విలీనం అయిన ముంపు గ్రామాలకు 2023 నుంచి పన్ను ఎలా విధిస్తారు..? 2025 వరకు గ్రామ పంచాయితీల ద్వారానే నిర్వాసితులు సేవలు పొందారు. 2026 వరకు మున్సిపల్ నుంచి ఎలాంటి సేవలు పొందలేదు. 2023 నుంచి పన్ను విధిస్తామంటే ఒప్పుకోము. సర్వస్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు 10 ఏళ్ల వరకు పన్ను విధించకూడదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు.






