నిబంధనల ఉల్లంఘన...అనుమతులకు మించి అంతస్తుల నిర్మాణం

by velandi.Saikiran |

నిబంధనల ఉల్లంఘన...అనుమతులకు మించి అంతస్తుల నిర్మాణం
X

* యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

* అనుమతులకు మించి అంతస్తుల నిర్మాణం

* రోడ్లను ఆక్రమించి ర్యాంపులు, మెట్లు ,కార్ షెడ్ల నిర్మాణం

* ఇరుకుగా మారుతున్న అంతర్గత రోడ్లు

దిశ,సంగారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ -1 మున్సిపాలిటీ వేగంగా విస్తరిస్తోంది పారిశ్రామిక వాణిక్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది . ఈ తరుణంలో భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవి అమలుకు నోచుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు మించి అక్రమ కట్టడాలు, ఇళ్ల ఎదుట రోడ్లను ఆక్రమించి, సిమెంట్‌ ర్యాంపులు, కార్‌ షెడ్‌లు యథేచ్ఛగా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.

సంగారెడ్డి పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగా అక్రమ నిర్మాణాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తీసుకుంటున్న అనుమతులు ఇంటి ప్లానకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. సెట్‌ బ్యాక్‌ ఉల్లంఘనలు, రోడ్ల అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని రెండు అంతస్తులు.. రెండు అంతస్తులకు అనుమతి పొంది మూడు, నాలుగు అంతస్తులు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. తమ స్థలంలో ఇంటిని నిర్మంచుకుని ముందు ఉన్న రోడ్డును ముందు నుంచి ఆరు ఫీట్ల మేర ఆక్రమించి సిమెంట్‌ ర్యాంపులు, మెట్లు, గార్డెన నిర్మించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా కారు షెడ్లనే నిర్మించుకోవడం గమనార్హం.

కొరవడిన పర్యవేక్షణ

సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగా పట్టణంలోని పలు కాలనీల్లో ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నారే తప్పా అనుమతులకు లోబడి నిర్మాణాలు చేస్తున్నారా? లేదా? అనే దానిపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమికంగా అనుమతులు ఇచ్చిన వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారి లేదా సిబ్బంది ముందు స్థల పరిశీలన చేయాల్సి ఉంటుంది. అనుమతులకు లోబడి నిర్మాణాలు చేస్తున్నారా లేదా ఉల్లంఘిస్తున్నారా అనేది అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.

ఇరుకుగా అంతర్గత రహదారులు

ఇంటి యజమానులు ప్రవేశ మార్గాలు సులభతరంగా ఉండాలని అంతర్గత రహదారులను ఆక్రమించి ర్యాంపులు, ఇనుప షెడ్లు నిర్మిస్తున్నారు. మొదట చిన్న చిన్న నిర్మాణాలతో మొదలై కాల క్రమేణా అవి శాశ్వత ఆక్రమణలుగా మారుతున్నాయి. సెట్‌ బ్యాక్‌లు పాటించకుండా స్థలం ఉన్నంత వరకు ఇంటి నిర్మాణం, ప్రహరీగోడలు నిర్మించుకుంటూ ప్రవేశ మార్గాల ద్వారా రోడ్లను ఆక్రమిస్తున్నారు. దీంతో రోడ్ల వెడల్పు తగ్గి ఇరుకుగా మారుతున్నాయి పార్కింగ్‌ సమస్యలు తలెత్తడం, నీటి సరఫరా, మురికి నీటి వ్యవస్థలకు ఆటంకాలు ఎదురవడం లాంటి సమస్యలకు దారి తీస్తున్నాయి. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక భద్రతకు ముప్పు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయి.

నిబంధనల అమలు ఏదీ?

అక్రమ నిర్మాణాల కట్టడికి నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ అమలు చేసే వ్యవస్థ సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. ఉల్లంఘనలు జరుగుతున్న సమయంలోనే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా స్పందించినట్టు ఆధారాలు లేవు. అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అనధికారికంగా చేపట్టిన కట్టడాలపై అధికార యంత్రాంగం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఇంటి ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తించి, యజమానులకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పర్యవేక్షణ, కఠిన చర్యలు లేకపోతే అక్రమాల పరంపర కొనసాగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story