కొంద‌రు ఐపీఎస్ లు మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : మాజీ మంత్రి హరీశ్ రావు

by Nallavelli.Anjaneyulu |

బీఆర్ఎస్ అగ్ర నాయకులతో పాటు ఇతర ఎమ్మెల్యేల ఫోన్లను, వారి ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాక్ చేస్తున్నారని, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

కొంద‌రు ఐపీఎస్ లు మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : మాజీ మంత్రి హరీశ్ రావు
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : బీఆర్ఎస్ అగ్ర నాయకులతో పాటు ఇతర ఎమ్మెల్యేల ఫోన్లను, వారి ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాక్ చేస్తున్నారని, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం కంది మండల కేంద్రంలో గల సెంట్రల్ జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులతో కలిసి జైలులో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొందరు ఐపీఎస్ అధికారులు బెంగుళూరు నుంచి తీసుకువచ్చిన ప్రైవేటు హ్యాకర్స్ ద్వారా తమ ఫోన్ లను, ఇంటి ముందు గల సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు.


రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆ ఐపీఎస్ అధికారులు రిటైర్డ్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. విచారణ జరిపిస్తామని, స్వంత ఖర్చులతో కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తోపాటు మరో ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. 308 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే మెజిస్ట్రేట్ కొట్టివేశారని స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులలో జైల్లో పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. క్రిశాంకు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పలేక బెయిల్ వచ్చే సమయంలో పిటి వారెంట్ తెచ్చి మళ్ళీ జైల్లో పెడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ బోగస్

రైతు డిక్లరేషన్ భోగసాని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శనగలు కొనుగోలు ఆపివేశారని, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ప్రారంభించలేదని, ఐదారు కిలోల తాలును తీస్తున్నారని, ధాన్యానికి ఇస్తామన్న బోనస్ 1560 కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని మీ పాలనలో రెండున్నర సంవత్సరాలుగా రైతులు, విద్యార్థులు ,ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని 420 హామీల గురించి ప్రజలకు తెలిసిపోయిందని, రాబోయేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నంమాణిక్యం ,కాసాల బుచ్చిరెడ్డి, కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మనోహర్ గౌడ్, షేక్ సాబేర్, మల్లా గౌడ్ , పెరుమాండ్ల నర్సింలు, జలంధర్ రావు, వాజిద్, శ్రావణ్ రెడ్డి, కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story