నీట్ (యూజీ)-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

by Batti.Sumithra |

జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

నీట్ (యూజీ)-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 3వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,772 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఇందుకోసం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.

బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు పైన తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తాజా ఫోటో ఉన్న ఐడీ ప్రూఫ్‌ను వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, వాచ్‌లు, బెల్ట్‌లు, చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, రింగ్ తదితర ఆభరణాలు వంటి వస్తువులు అనుమతించబడవని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. పరీక్షా రోజున విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలు ఉండేలా చూడాలని తెలిపారు. ఈ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులు, సెంటర్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీవో, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story