సిద్దిపేటలో పామాయిల్ మెగా ఫ్యాక్టరీ.. రాష్ట్రంలో తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్

by Ramesh Naini |

కాలుష్య రహితంగా, వ్యర్థాలతో విద్యుత్, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి నూనె ఉత్పత్తి ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పామాయిల్ పరిశ్రమను ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

సిద్దిపేటలో పామాయిల్ మెగా ఫ్యాక్టరీ.. రాష్ట్రంలో తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్రంలోనే తొలి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్దమైంది. అత్యాధునిక టెక్నాలజీతో కాలుష్య రహితంగా, వ్యర్థాలతో విద్యుత్, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి నూనె ఉత్పత్తి ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పామాయిల్ పరిశ్రమను ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని నర్మెట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూ.వందల కోట్లతో 62 ఎకరాల్లో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి ఏప్రిల్ 14 2022లో శంకుస్థాపన చేశారు. జనవరి 2024 లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. 17 సెప్టెంబర్ 2025 లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ప్రస్తుతం గంటకు 30 టన్నులు, 20 గంటల్లో 6 వందల టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్, 120 టన్నుల ముడి ఆయిల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ని నిర్మించారు. భవిష్యత్ లో గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్ధ్యానికి పెంచుకునే విధంగా ఫ్యాక్టరీకి రూపకల్పన చేశారు.

7 జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో..

సిద్దిపేట, జనగాం, యాదాద్రి, గద్వాల్, నారాయణ పేట, మహాబుబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం తోటలను రైతులు సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 14, 300 ఎకరాల్లో ఆయిల్ ఫాం తోటలు సాగు చేస్తున్నారు. ఈ 7 జిల్లాల్లో రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లో క్రషింగ్ చేస్తారు. ఇంటర్ నేషనల్ మార్కెట్ ధర, నూనె శాతం ఆధారంగా రేట్ నిర్ణయించి టన్నుకు రూ. 21546 చొప్పున నెలలో సోమ, గురు వారాల్లో రైతులకు బిల్లులు చెల్లిస్తారు.

జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ..

మలేషియా టెక్నాలజీ అయిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ (జేడ్ఎల్‌డీ) తో రాష్ట్రంలో నిర్మించిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. వేస్ట్ వాటర్ ను రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునే వీలు ఉంది. దీంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో పర్యావరణ కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా పామాయిల్ ప్రాసెసింగ్ సమయంలో నీటి వినియోగం తగ్గించే విధంగా మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ (ఎమ్ఈఈ) టెక్నాలజీతో నిర్మించారు. దీనికి తోడు క్రషింగ్ వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మాణం మరో ప్రత్యేకత. దీంతో ఫ్యాక్టరీ విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

గింజల నుంచి ఫామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి

పామాయిల్ గింజ నుంచి ఆయిల్ తీసే యూనిట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మరో ప్రత్యేకత. గింజ నుంచి ఉత్పత్తి చేసే ఫామ్ కెర్నల్ ఆయిల్ ను కాస్మోటిక్స్, బేకరీ ఐటమ్స్, సబ్బులు, కొబ్బరి నూనెల్లో వినియోగిస్తారు.

పొన్నం, తుమ్మల ప్రత్యేక శ్రద్ధ..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించారు. పలు మార్లు ఫ్యాక్టరీ సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం

నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజం పడింది. మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో నిధుల విడుదల మొదలు స్థల సేకరణ తదితర పనులు త్వరితగతిన పూర్తి చేశారు. అదే విధంగా రైతులను ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లించడానికి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనికి తోడు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఎప్పటికి కప్పుడు పర్యవేక్షించారు. ఈ ఫ్యాక్టరీ తో సిద్దిపేట ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

ఈనెల 22న ప్రారంభం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గంటకు 30 టన్నుల సామర్థ్యం గల పామాయిల్ మిల్లు, 4 మెగావాట్ల పవర్ ప్లాంట్ లను ప్రారంభించనున్నారు. అదే విధంగా 250 టన్నులు ఫర్ డే రిఫైనరీ యూ నిట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Next Story