- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక ధరలకు యూరియా విక్రయాలు.. పట్టించుకోని అధికారులు
మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుండగా మరోవైపు ఎరువుల వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

దిశ,దౌల్తాబాద్: మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుండగా మరోవైపు ఎరువుల వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు యూరియాను విక్రయించాల్సిన వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం మండల కేంద్రంలోని జ్యోతి ఫర్టిలైజర్ దుకాణంలో సబ్సిడీ యూరియా అందుబాటులో ఉండగా బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులు బస్తాలు తీసుకునేందుకు వెళ్లారు.
అయితే బస్తా ధర రూ.320 అయితేనే అమ్ముతానని దుకాణ యజమాని స్పష్టం చేశాడు. దీంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి కొంతసేపు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దుకాణ యజమాని దుకాణాన్ని మూసివేసి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో రైతులు చేసేదిలేక రూ.320 ధరకు యూరియా బస్తాలు కొనుగోలు చేసి వెళ్లినట్లు వాపోతున్నారు.
డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రంలోనూ..
మండల పరిధిలోని డిసిఎంఎస్ రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266 కాగా అక్కడ రూ.300 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వస్తున్నాయని, లేదంటే మాకు నష్టం వస్తుందని కేంద్ర నిర్వాహకులు సమాధానం చెబుతున్నట్లు తెలిపారు. మరో ఘటనలో మండలంలోని కొనాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు మూడు బస్తాల యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నాడు.
బస్తాలు తీసుకోవడానికి రైతు సేవా కేంద్రానికి వెళ్లగా తన యూరియా ఇప్పటికే కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించడంతో రైతు నివ్వెరపోయాడు. తాను కొనుగోలు చేయకుండానే యూరియా ఎలా విక్రయమైందని ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా విక్రయాల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై వ్యవసాయ శాఖ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి అధిక ధరలకు యూరియా విక్రయాలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.






