సిద్దిపేటకు నో..! సహకరించని పొన్నం

by Thanuru Gopichand |

నామినేటెడ్ పదవుల్లో సిద్దిపేటకు నో..? పదవుల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... నియోజకవర్గానికి ప్రాధాన్యం లభించక పోవడం.. జాబితాలకే పరిమితం కావడంతో సిద్దిపేట నియోజకవర్గ హస్తం శ్రేణులు నారాజ్ లో ఉన్నారు.

సిద్దిపేటకు నో..! సహకరించని పొన్నం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: నామినేటెడ్ పదవుల్లో సిద్దిపేటకు నో..? పదవుల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... నియోజకవర్గానికి ప్రాధాన్యం లభించక పోవడం.. జాబితాలకే పరిమితం కావడంతో సిద్దిపేట నియోజకవర్గ హస్తం శ్రేణులు నారాజ్ లో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సిద్దిపేట నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో నామినేటెడ్ పోస్టుల కోసం నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు గంపెడాశలు పెట్టుకున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మార్కెట్ కమిటీల పాలక వర్గాలు, సిద్దిపేట అర్బన్ డెవలంప్ మెంట్ అథారటీ చైర్మన్, పాలక వర్గం, దేవాలయ కమిటీ పాలక వర్గాల నియమించలేదు. ఇటీవల దుబ్బాక నియోజక వర్గానికి సంబంధించి తోగుట, దుబ్బాక, మిరుదొడ్డి, చేగుంట, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామకం సందర్భంలో సైతం సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన నేతలకు నిరాశనే ఎదురైంది.

నామినేటెడ్ పోస్టుల కోసం హస్తం పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న జాబితాలకే పరిమితం కావడం గమనార్హం. సిద్దిపేట నియోజక వర్గానికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం ఒక్కటి రెండు పదవులు మినహా ప్రాధాన్యం దక్కిన దాఖలాలు లేవు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితమై సిద్దిపేట జిల్లా క్యాడర్ ను పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు వాపోతున్నారు. పుండు మీద కారం చల్లిన చందానా జిల్లా మంత్రి సిఫారసు లేఖలు సైతం ఇవ్వకపోవడంపై హస్తం శ్రేణులు కారాలు మిరియాలు నూరుతున్నారు. జిల్లాలోని హుస్నాబాద్ నియోజక వర్గం నుంచి గెలుపొంది.. రాష్ట్ర క్యాబినెట్ లో స్థానం పొందినప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉన్నట్లు భావిస్తూ సిద్దిపేట జిల్లాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి సైతం నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చొరవ చూపడం లేదని శ్రేణులు బహిరంగంగానే చర్చించుకోవడం సిద్దిపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ హస్తం శ్రేణుల్లో నెలకున్న నైరాశ్యానికి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా పరిష్కారం చూపుతుందో వేచి చూడాల్సిందే.

Next Story