- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిరుదొడ్డిలో ఒరిగిపోతున్న నూతన విద్యుత్ స్థంభాలు!
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

దిశ, మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే బ్యాక్ ఫీడింగ్ కోసం కొత్తగా లింగుపల్లి గ్రామం నుండి మిరుదొడ్డి విద్యుత్ ఉప కేంద్రానికి కలిపేందుకు పాతిన 33KV విద్యుత్ స్థంభాలు ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ప్రమాదకరంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేసిన కాంట్రాక్టర్
నూతన విద్యుత్ లైన్ కోసం పాతిన స్తంభాల విషయంలో కాంట్రాక్టర్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అరకొర గుంతలు..
స్థంభాలను సరైన లోతులో పాతకుండా , పైపైన గుంతలు తీసి సరిపెట్టారు. సిమెంటింగ్, మట్టి పూర్తిగా పూడ్చకపోవడంతో స్తంభాలు పాతిన తర్వాత వాటి చుట్టూ గట్టిగా మట్టిని నింపడం లేదా కాంక్రీట్ (సిమెంటింగ్) వేయడం వంటి పనులు మరిచారు. స్తంభాల చుట్టూ పెద్ద పెద్ద గుంతలు అలాగే తెరిచి ఉన్నాయి.
ఒరిగిపోతున్న స్తంభాలు..
భూమిలో పట్టు లేకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని కొత్త స్తంభాలు ప్రమాదకరంగా ఒక వైపునకు ఒరిగిపోయాయి. బలమైన గాలి లేదా స్వల్ప వర్షం వస్తే ఇవి పూర్తిగా నేలమట్టమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఒక స్థంభం కిందపడి విరిగిపోయింది.
అధికారుల పర్యవేక్షణ కరవు..
సుమారు 13 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ఇటువంటి పనులపై విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడుతున్నారు. పనులు పూర్తయ్యే లోపే స్తంభాలు ఇలా ఒరిగిపోతుంటే, భవిష్యత్తులో ఈ లైన్ గుండా విద్యుత్ సరఫరా జరిగితే ఎంతటి ప్రమాదం పొంచి ఉందోనని ఆందోళన చెందుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి...
ప్రమాదకరంగా మారిన ఈ విద్యుత్ స్తంభాలను వెంటనే సరిచేసి, నాణ్యతా ప్రమాణాల ప్రకారం వాటిని గట్టిపరచాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారు.






