మత్తు పదార్థాలను నియంత్రించాలి

by Taduka Kalyani |

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

మత్తు పదార్థాలను నియంత్రించాలి
X

దిశ, మెదక్ ప్రతినిధి : మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యల అమలు, మత్తు పదార్థాల నిర్మూలన పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అవసరమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టులు వినియోగించడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.అదే విధంగా జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, చట్ట విరుద్ధంగా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలన విషయంలో ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో,ఆర్ అండ్ బి ఈ, ఈ వేణు, డీఎస్పీలు , జిల్లా రవాణా శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు ,ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story