పరిశ్రమ కాలుష్యకాటుకు గురవుతున్న నందికంది..

by Kodari Anjali |

బ్లూ క్రాఫ్ట్ ఆర్గో బరితెగింపు వల్ల నందికంది గ్రామం కాలుష్యమయం అవుతుంది.

పరిశ్రమ కాలుష్యకాటుకు గురవుతున్న నందికంది..
X

దిశ, సంగారెడ్డి: అక్కడ పరిశ్రమ వస్తే పదిమందికి ఉపాధితో పాటు అభివృద్ధి పరంగా అందరికీ ఎంతో మేలు జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలు అందరూ భావించారు. కానీ, కొంతకాలంగా ఆ పరిశ్రమ చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు అదే పరిశ్రమ యమపాశంలా తయారవుతోం. సదరు పరిశ్రమ నుంచి వచ్చే కలుషితం వల్ల ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతంలోని గాలి, భూగర్భ జలాలు అంతా కలుషితమైపోయి ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నంది కంది గ్రామపంచాయతీ పరిధిలోని "బ్లూ క్రాఫ్ట్ ఆర్గో" పరిశ్రమ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది.

కాలుష్యం కాటుకు రంగు మారుతున్న నీరు..

నందికంది గ్రామం జాతీయ రహదారికి అనుకుని 30ఏళ్ల క్రితం గాయత్రి స్టార్ కెమ్ పేరిట ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అదే పరిశ్రమను ప్రస్తుతం బ్లూ క్రాఫ్ట్ ఆర్గో యాజమాన్యం తీసుకుంది. ఇక్కడ ప్రస్తుతం 110మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ తో పాటు 50మంది స్టాఫ్, 200మంది వర్కర్లు పని చేస్తున్నారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన సహజ పిండి పదార్థాలు అయిన సోడియం స్టార్చ్ గ్లైకోలేట్, మాల్టో డేక్స్ట్రిన్, మొక్కజొన్న గ్లూటన్, పీచు పదార్థాలు ఇందులో తయారవుతాయి. అయితే గతంలో పరిశ్రమ అని రకాల పద్ధతులు పాటించడం ద్వారా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ తయారైన పదార్థాల అనంతరం వస్తున్న వ్యర్ధాలను బయటికి నేరుగా వదలడం ద్వారా ఆ చుట్టుముట్టు ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోతున్నాయి. దీనికి తోడు ఆ చుట్టుముట్టు దూర గ్రామాల్లో గాలి కూడా కలుషితం అవుతుంది. తద్వారా పక్కనే ఉన్న నందికంది గ్రామస్తులకు ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో జీవనం నరకప్రాయంగా మారుతుంది. కాగా పరిశ్రమ దగ్గర నివసిస్తున్న కుటుంబాల్లోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ తయారవుతున్న పదార్థాల ద్వారా వచ్చే వ్యర్ధాలను శుద్ధిచేసి బయటకి వదలాల్సిన ఎస్.టి.పి కూడా లేకపోవడంతో కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది.

అధికారులు మౌనం వీడాలి..

పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యానికి నందికంది గ్రామంతో పాటు చుట్టుముట్టు గ్రామాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవడంతో ఆ నీరంతా విషపూరితంగా మారుతుంది. ఇక్కడ నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా నంది వాగులో కలిసి అక్కడి నుంచి ముబారక్పూర్ వద్దకు చేరి అక్కడ ఉన్న మంజీరా నీటిలో ఈ కలుషితకు నీరు కలవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమ సరైన నియమాలు పాటించకపోవడంతో ఇక్కడ నుంచి కలుషితంగా మారిన డస్ట్ అంతా పక్కనే ఉన్న గ్రామంలో కుప్పలుగా పడుతుండడంతో అక్కడివారికి జీవనం నరకప్రాయంగా మారింది.

చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆందోళన

బ్లూ క్రాఫ్ట్ ఆర్గో పరిశ్రమపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. సంబంధిత అధికారులు మౌనం వీడి పరిశ్రమ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వారు పరిశ్రమ ఎదుట నిరసన కూడా వ్యక్తం చేశారు.

పీసీబీ ఉత్తర్వులు పట్టించుకోని యాజమాన్యం

బ్లూ క్రాఫ్ట్ ఆర్గో పరిశ్రమ నిర్లక్ష్యం కారణంగా వస్తున్న కలుషితంపైన గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత మే 15న పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలంటూ క్లోజర్ ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది. అన్ని సక్రమంగా ఉన్న తర్వాతనే తిరిగి పరిశ్రమను ప్రారంభించుకోవాలని వారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా కూడా పరి శ్రమ యాజమాన్యం వాటిని ఏమా త్రం పట్టించుకోవడం లేదు. ఓవైపు గ్రామ ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే పరిశ్రమ యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరించడం ఆందోళనకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

-స్రవంతి విజయభాస్కర్ రెడ్డి, నంది కంది సర్పంచ్

Next Story