సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

by Ratna Kumari |

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని అంశం పై ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని అంశం పై ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రసంగాల్లో నేను అధికారంలో ఉంటా అంటున్నాడు ..తప్ప మేము అధికారంలో ఉంటామని చెప్పడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల‌ సమావేశంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మున్సిపాలిటీలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల పై చర్చకు సిద్దమా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వివిధ మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం రూ.270 కోట్లు వరకు నిధులు అందించినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండటంతో శత్రువులు కుమ్మకై ముక్కుమ్మడి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దుబ్బాక లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిధులు లేవని చేతులు ఎత్తేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారని సూటిగా ప్రశ్నించారు.

ప‌ని దినాలు పెంచితే కాంగ్రెస్ కి వ‌చ్చే న‌ష్ట‌మేంటి..?

పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి కూలీల పని దినాలు పెంచితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటని ఎంపీ రఘునందన్ రావు సూటి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు మహాత్మ గాంధీ పై ప్రేమ లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి తొలుత మహాత్మ గాంధీ పేరు పెట్టలేదన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని ప్రధాని మోడీ మరింత ప్రతిష్టంగా అమలు చేయాలని మెరుగులు దిద్దితే కాంగ్రెస్ నాయకులు అర్ధ రహితంగా ఆందోళన చేస్తామని ప్రకటించడం రాజకీయ దిగజారుడు తానానికి నిదర్శనం అన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉపాధి హామీ పథకానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 9 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దేశంలో రామ రాజ్య స్థాపన జరగాలని మహాత్మ గాంధీ కోరుకున్నాడని అన్నారు. కొత్త చట్టంలో గ్రామ సభల ద్వారా సర్పంచ్ గ్రామంలో చేపట్టాల్సిన పనులను నిర్ణయించుకునే అవకాశం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, నాయకులు వంగ రామచంద్రారెడ్డి, గాడిపల్లి భాస్కర్ పాల్గొన్నారు.


Next Story