రింగు రోడ్డు పూర్తి చేసేందుకు ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి

by Ratna Kumari |

గజ్వేల్ రింగు రోడ్డు నిర్మాణం పూర్తికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు రంగంలోకి దిగారు.

రింగు రోడ్డు పూర్తి చేసేందుకు  ఎంపీ రఘునందన్ రావు  రంగంలోకి
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ రింగు రోడ్డు నిర్మాణం పూర్తికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు రంగంలోకి దిగారు. గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో భూ సేకరణ సమస్య కారణంగా గత కొద్ది సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన గజ్వేల్ రింగు రోడ్డు స్థలాన్ని శనివారం స్థానిక నాయకులతో కలిసి ఎంపీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిలిచిపోయిన రింగురోడ్డు నిర్మాణానికి కేవలం 151 మీటర్ల భూ సేకరణకు సంబంధించి రామచంద్రం అనే రైతును ఒప్పించడంలో జిల్లా యంత్రాంగం, అధికారులు మీనవేశాలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయంపై గత నెలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సిద్దిపేట జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గజ్వేల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరానని.. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అందులో భాగంగానే నిలిచిపోయిన రింగు రోడ్డు నిర్మాణం పూర్తి చేయుటకు చొరవ తీసుకొనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో రైతు రామచంద్రంతో భూసేకరణ గురించి మాట్లాడుతానని చెప్పారు. ఆయన ఒకవేళ ఒప్పుకోకుంటే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించిన భూములకు అమలు చేసిన 123 చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందని వివరించారు. రైతు ఒప్పుకోకుంటే ప్రజా అవసరాల కోసం అవసరమయ్యే భూ సేకరణకు రెవెన్యూ చట్టం ప్రకారం.. ముందుకు వెళ్లాలని గజ్వేల్ ఆర్డీవో కు సూచించినట్లు తెలిపారు. రింగురోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ గురించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసేలా కలెక్టర్ ని కలవనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే నిలిచిపోయిన రింగురోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకుందామని స్పష్టం చేశారు. ఎంపీ వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు పంజాల అశోక్, పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్, నాయకులు నలగామ శ్రీనివాస్, అరవింద్ తదితరులు ఉన్నారు.

Next Story