తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైంది: లక్ష్మణ్

by Disha Web |
తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైంది: లక్ష్మణ్
X

దిశ, పటాన్ చెరు: తెలంగాణలో కుటుంబ పాలన రాజ్యమేలుతుందని, ఎందరో అమరవీరుల త్యాగఫలంతో సిద్ధించిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం సాయంత్రం పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీరంగూడ కమాన్ వద్ద నుండి బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీరంగూడ కమాన్ నుండి చిన్నకంజర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిన్నకంజర్లలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి బీజేపీ విధానాలకు ఆకర్షితులై దేశమంతా మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణలో దొరల పాలన రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణను మద్యం తెలంగాణగా మార్చారని విమర్శలు గుప్పించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్న దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. హామీలను ఇచ్చి నట్టేట ముంచిన నయవంచకుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతుందని మండిపడ్డారు. బీజేపీ వస్తేనే బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉచిత విద్య, వైద్యం పైనే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు భూకబ్జాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని ప్రజల సంక్షేమం గాలికి వదిలేశాడని విమర్శించారు. ఈ అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ బీజేపీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ మహిళా రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, సీనియర్ నాయకులు అదేల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story