సంగారెడ్డి జైలులో మెగా సోలార్ ప్లాంట్

by Disha Web Desk 1 |
సంగారెడ్డి జైలులో మెగా సోలార్ ప్లాంట్
X

దిశ, కంది: మనం రోజు ఇంట్లో వాడే విద్యుత్ కు సంబంధించి ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి నెలకు రూ.800 నుంచి రూ.వేయి వరకు కరెంటు బిల్లు వస్తుంది. అదే బయట చిన్న చిన్న బిజినెస్ షాపుల్లో అయితే రూ.3వేల నుంచి రూ.4వేల వరకు సుమారుగా కరెంటు బిల్లు వస్తుంది. మనం విద్యుత్ ను వాడే తీరును బట్టి ఒక్కోచోట ఒక్కోలా విద్యుత్ చార్జీలు యూనిట్ల వాడకం చొప్పున బిల్లలు వస్తాయి.

కానీ, 600 మంది, 40 ఎకరాల విశాలమైన జైలు లో కరెంటు బిల్లు ఎంత వస్తుందని అనుకుంటున్నారు. రూ.6.లక్షలు వస్తుందని సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.లక్ష చొప్పున విద్యుత్ శాఖకు జైళ్ల శాఖ కరెంట్ బిల్లు ద్వారా కడుతూ వస్తుంది. తాజాగా సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ తో విద్యుత్ చార్జీ లు పూర్తిగా తగ్గనున్నాయి. మరో వారం రోజుల్లో ప్లాంట్ ను జైలు అధికారులు అధికారికంగా ప్రారంభించనున్నారు.

రూ.20 లక్షలతో 32 కేవీ మెగా సోలార్ ప్లాంట్..

సంగారెడ్డి జిల్లా కేంద్రం కంది మండలంలోని జైలును ఈ మధ్యే సెంట్రల్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జైలు ప్రధాన ద్వారానికి సెంట్రల్ జైలు బోర్డును కూడా ఇక్కడ అధికారులు మార్చి ఏర్పాటు చేశారు. తాజాగా రాష్ట్ర జైలు శాఖ విడుదల చేసిన రూ.20 లక్షల నిధులతో సంగారెడ్డి సెంట్రల్ జైల్లో 32 కేవీ సామర్థ్యం గల మెగా సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకు జైలులో రూ.లక్ష వరకు కరెంట్ బిల్లును విద్యుత్ శాఖకు కడుతూ వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ తో కరెంటు బిల్లు బెడద పూర్తిగా తీరనుంది. ప్లాంట్ ను మరో వారం రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

ఇతర శాఖలకు స్ఫూర్తిగా..

సంగారెడ్డి జైలులో అనేక కొత్త కొత్త సంస్కరణలతో ఆ శాఖకు ప్రతినెలా ఆదాయం తీసుకొచ్చేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. జైలు లోపల ఒక పరిశ్రమ ద్వారా అల్మారా, బెంచీల తయారీతో ప్రతి నెలా ఆ శాఖకు ఆదాయం చేకూరుతోంది. ఇదే జైలు కొద్ది దూరంలో కాశీపూర్ వద్ద పెట్రోల్ బంకును కూడా జీవిత ఖైదు సిబ్బందికి నెలకు జీతాలు ఇస్తూ ఆ బంకును నడిపిస్తూ శాఖకు ఆదాయం చేకూరుస్తున్నారు. తాజాగా జైలులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ద్వారా రూపాయి కరెంటు బిల్లు లేకుండా 24 గంటలు విద్యుత్ వినియోగాన్ని ఉపయోగించనున్నారు. రాష్ట్ర జైలు శాఖ అధికారుల సరికొత్త ఆలోచనలతో ఆ శాఖకు అటు ఆదాయంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే విధంగా ముందుకు సాగుతున్నారు.


Next Story

Most Viewed