- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే
సమాజమే ముఖ్యమని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: సమాజమే ముఖ్యమని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అనిటీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు జిల్లాలో శనివారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నటరాజ్ థియేటర్ సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, మహిళా విద్య కోసం చేసిన కృషిచిరస్మరణీయమన్నారు.
ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలని ఆశించిన గొప్ప సంఘసంస్కర్తగా ఆయనను కొనియాడారు. మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవల వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి పాఠశాలలు, హాస్టళ్లలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధి, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లాలో డిగ్రీ, జూనియర్ కళాశాలల బాలికలకు హాస్టల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని అన్నారు. మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి పూలే సేవలను గుర్తుచేశారు. పూలే దంపతుల స్ఫూర్తితో యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో బీసీ వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం సి.ఎస్.ఆర్ నిధుల కింద రూ.35 లక్షలతో ట్రంక్ బాక్సులు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. రూ.1.52 కోట్ల వ్యయంతో హాస్టల్ భవనాల మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. ఎస్ఎస్ సీ విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ గైడ్స్ అందజేసినట్లు, గత సంవత్సరం పదవ తరగతిలో 99.5 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా గ్రూప్స్, యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్‌తో పాటు అవసరమైన మెటీరియల్ అందించామని కలెక్టర్ తెలిపారు. బీసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, జిల్లా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు






