- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళ్లు మొక్కుతాం.. కెమికల్ కంపెనీ వద్దు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్ లిమిటెడ్' పరిశ్రమ ఏర్పాటు చేయకూడదని ప్రజలు అధికారులను కోరారు.

దిశ, న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో నూతనంగా ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్ లిమిటెడ్' పరిశ్రమ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని, చేస్తే అటు ప్రజలు, అటు పంటలన్నీ నాశనమవుతాయని టీపీజేఏసీ, సైన్టిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థలు గత 10 రోజులుగా మండలంలోని మల్గి, డప్పూర్ గ్రామాలతో పాటు వివిధ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. కంపెనీ ఏర్పాటుపై శనివారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మల్గి గ్రామంలో అధికారులు నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురితో పాటు పీసీబీ అధికారులు హాజరయ్యారు. నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో ప్రజలు తమ గళాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన విషయం స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతుతో మరింత బలం చేకూరినట్లైంది. ఈ సందర్భంగా ప్రజాభిసేకరణలో ఈ కంపెనీ స్థాపన వల్ల మల్గి, చుట్టుపక్కల గ్రామాలకు జరిగే నష్టాలపై ప్రజలు అధికారులకు వివరించారు. ఎలాగైనా కంపెనీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పరిశ్రమ తరుపున ఆంధ్రప్రదేశ్ అనంతపురం, హైదరాబాద్ నగరాల నుంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై కంపెనీ ఏర్పాటైతే మీ ప్రాంత వాసులకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగాలు వద్దు.. గిద్యోగాలు వద్దు.. మీ కంపెనీ వద్దు.. మీ సలహాలు వద్దు అంటూ ప్రజలు వారిని నిలదీశారు.
పేపర్ లో మేము ఏమి రాయాలి..?
ముందుగా మీ అభిప్రాయలను తెలుపాలని ప్రజలకు అధికారులు పేపర్ స్లిప్పులు ఇచ్చినప్పటికీ అందులో మేము ఏమి రాయాలి.. ఆ పేపర్లు మాకెందుకు.. మాకు కంపెనీ వద్దు అనడం తప్ప.. మిగతా మాటలు ఏమి వద్దని ఖరాఖండిగా అధికారుల వద్ద తమ గళాన్ని వినిపించారు. దీంతో చేసేదేమిలేక అధికారులు ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు చెప్పారు. ఈ ప్రజా భిప్రాయ సేకరణలో పీసీబీ అధికారి విజయలక్ష్మి, జహీరాబాద్ ఆర్డిఓ దేవుజ, స్థానిక ఎమ్మార్వో ప్రభులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సైన్టిస్ట్స్ ఫర్ పీపుల్ నాయకుడు డాక్టర్ బాబూ రావు, టీపీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్, జిల్లా నాయకులు లక్ష్మి, మానసలు ప్రజలకు మద్దతు తెలిపి మాట్లాడారు. కర్ణాటక సరిహద్దుకు కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర స్థాయిలో అనుమతులు కోరడం చట్టవిరుద్ధమన్నారు.
రూ.36 కోట్లకు పైగా పెట్టుబడి
హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు తాగు, సాగుకు నీరు అందిస్తున్న తరుణంలో ఆ నీటిలో ఈ కంపెనీ వ్యర్థ జలాలు కలుషితమై ఇటు ప్రజలు.. అటు పంటలు నాశనమయ్యే అవకాశం ఉందన్నారు. అదే విధంగా ప్లాంట్ తయారు చేసే ఫార్మాల్డిహైడ్ రసాయనం వల్ల ప్రజలకు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమఏర్పాటులో రూ.36 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతూ కేవలం 25 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసిన కంపెనీ ఏర్పాటు విషయంలో మరోసారి ఆలోచించి కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్నిఉపసంహకరించుకోవాలని కోరారు.






