నకిలీ సాక్షులతో భూమి రిజిస్ట్రేషన్.. రైతు ఆత్మహత్య వెనుక అసలు నిజాలు

by Batti.Sumithra |

భూమి వివాదంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

నకిలీ సాక్షులతో భూమి రిజిస్ట్రేషన్.. రైతు ఆత్మహత్య వెనుక అసలు నిజాలు
X

దిశ, కంగ్టి : మండలంలో భూమి వివాదంతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యవసాయ & రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి స్వయంగా గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కమిషన్ సభ్యులుగా కేవీఎన్ రెడ్డి, భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మరణించిన రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి వద్ద నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. విచారణలో భాగంగా అప్పటి సాక్షులుగా ఉన్న వారిని కూడా విచారించారు. సాక్షుల విషయానికి వస్తే, అప్పటి సాక్షుల్లో దిగంబర్ మరణించినట్లు తెలిసింది. మిగతా సాక్షులు బలరాం, భూమయ్య తమకు చదువు రాదని, ఎవరు చెప్పారో వాళ్ల మాట విని సంతకాలు చేశామని తెలిపారు. మరో సాక్షి హుసేన్ 2003 సమయంలో తాను గాజులపాడ్ గ్రామంలో లేనని వెల్లడించాడు. ఈ అంశాలు కేసులో అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. రైతు మాధవరావు పాటిల్ (61)కు చెందిన భూమి అక్రమంగా ఇతరుల పేర్ల పై రిజిస్ట్రేషన్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాస్‌బుక్ రాకపోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

కోదండ రెడ్డి మాట్లాడుతూ “మండలంలో భూమి అక్రమాలు తీవ్రంగా ఉన్నాయి. మధ్య దళారులు అమాయక రైతులను లక్ష్యంగా చేసుకుని సాదాబైనామాల ద్వారా భూములు కాజేస్తున్నారు. నకిలీ సాక్షులతో రిజిస్ట్రేషన్లు జరగడం ఆందోళనకరం. మండలంలో లింక్డ్ డాక్యుమెంట్లు లేకుండా చాలా భూములు సాదాబైనామా కింద ఇతరుల, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల పేర్ల పై మారినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడి మరణించిన ఘటనలు ఉన్నాయని, ఒక మహిళ తహసీల్దార్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ధరణి వ్యవస్థ వల్ల కొంతమంది నాయకుల ఆస్తులు పెరిగినట్లు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకువస్తున్న భూభారతి చట్టం రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ “రైతుల భూముల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వం సహించదు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది. మండలంలో ఉన్న భూమి సమస్యలను దశలవారీగా పరిష్కరించి, దళారీల దందాకు అడ్డుకట్ట వేస్తాం” అని తెలిపారు. అసైన్‌మెంట్ భూములు, నిషేధిత జాబితా (పార్ట్ బి)లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. గ్రామంలో లేని వ్యక్తులు లేదా మరణించిన వారిని సాక్షులుగా చూపించి భూములు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై పూర్తి పత్రాలు సేకరించి కమిషన్‌కు సమర్పించినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కమిషన్ తుది నివేదిక అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమ హారతి, అదనపు ఎస్పీ చైతన్య, తహసీల్దార్ గంగా భవానీ, సీఐ వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మోగిని, ఎస్సై దుర్గ రెడ్డి పాల్గొన్నారు.

Next Story