నల్లపోచమ్మ ఆలయం వద్ద ఏరులై పారుతున్న మద్యం..

by Disha Web Desk 20 |
నల్లపోచమ్మ ఆలయం వద్ద ఏరులై పారుతున్న మద్యం..
X

దిశ, కౌడిపల్లి : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం తర్వాత అతిపెద్ద రెండో ఆలయంగా మండలంలోని శ్రీ తునికి నల్లపోచమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. గురువారం, ఆదివారం శ్రీ నల్లపోచమ్మను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా వస్తుంటారు. ప్రతి ఏటా జాతరకు ముందు దేవదాయశాఖ దుకాణాల సముదాయానికి బహిరంగ వేలంపాట నిర్వహిస్తుంటారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నాలుగు దుకాణాలు కొనసాగుతున్నాయి. దేవాదాయశాఖ నిర్వహించిన బహిరంగ వేలంలో 1) దుకాణాన్ని రూ.7 ఏడు లక్షల 5వేలకు, 2) దుకాణాన్ని రూ. 7 లక్షల 65 వేలకు, 3) దుకాణాన్ని రూ.6 లక్షల 5 వేలకు, 4) దుకాణాన్ని(డబ్బా) రూ 3 లక్షల 85 వేలకు గ్రామస్తులు దక్కించుకున్నారు. వేలంపాట నిర్వహించినప్పుడు దుకాణాలలో కిరణా సామాగ్రి తప్ప మద్యం విక్రయాలు జరపవద్దని ఎండోమెంట్ అధికారులు స్పష్టం చేశారు.

అయినప్పటికీ దేవాదాయశాఖ కాంప్లెక్స్ లోని నాలుగు దుకాణాల్లో మద్యం సీసాలు ఆరు బయట ఉంచి బహిరంగంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ఎండోమెంట్ అధికారులు గానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాగునీటికి భక్తులు అవస్థలు పడుతున్నప్పటికీ మద్యంకు ఏ మాత్రం అవస్థలు పడాల్సిన అవసరం లేదని మద్యం ప్రియులు వాపోతున్నారు. దేవాదాయశాఖ చట్టం ప్రకారం ఆలయం వద్ద మద్యం విక్రయాలు జరుపకూడదు. ఆలయం సమీపంలో బహిరంగంగా మద్యం అమ్మకాలు నిషేధించాల్సి ఉండగా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దేవాదాయ శాఖ షాపింగ్ కాంప్లెక్స్ లో బహిరంగంగా మద్యంసీసాలు ఉంచి విక్రయిస్తున్నారు.

మూడుబీర్లు, ఆరుక్వార్టర్లు, లెక్కన జరపడంతో పాటు ప్రతిదుకాణం వెనుక భాగంలో సెట్టింగ్ ఏర్పాటు చేసి మద్యం ప్రియులకు కావలసిన వసతులు దుకాణాల యజమానులు ఏర్పాటు చేయడం గమనార్హం. మద్యం దుకాణాలలో రూ.150 అమ్మే బీరు సీసా రూ.200కు, రూ.150కు అమ్మే క్వాటర్ విస్కీ 200 చొప్పున విక్రయిస్తున్నారని అక్కడికి వచ్చిన భక్తులు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలు జరపకుండా చూడాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా బెల్టుదుకాణాల సిండికేటుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని విచారణ జరుపుతానని తెలిపారు.

Next Story

Most Viewed