మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఉద్ధవ్ థాక్రే..కారణమేంటి?

by Dishanational2 |
మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఉద్ధవ్ థాక్రే..కారణమేంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. ఈ మేరకు గత ఎన్నికల్లో మోడీకి ఓట్లు వేయాలని కోరినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్కరంజిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. శివసేన చీలిపోయిందని, కానీ అసలు శివసేన ఎవరిది అనే దానిపై సుప్రీంకోర్టు తన తీర్పును ఇంకా వెల్లడించలేదని తెలిపారు. బీజేపీ సేవకులైన ఎన్నికల సంఘం, వారి మధ్య వర్తి అయిన స్పీకర్ నార్వేకర్ మాత్రమే తీర్పులు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

మోడీ మహారాష్ట్రకు వచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడకుండా, కేవలం తనను, శరద్ పవార్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో చేతులు కలపడానికి ఎవరూ ఇష్టపడనప్పుడు, శివసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. అటువంటి పార్టీని బీజేపీ పడగొట్టిందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేనను బీజేపీ ఉపయోగించుకుందని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ ర్యాలీకి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ కూడా హాజరయ్యారు.

Next Story

Most Viewed