కుకూనూర్‌లో అక్రమ నిర్మాణం.. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

by Ajay Maddhiboyina |

జిల్లాలోనే అత్యున్నత అధికారిక హోదాలో ఉన్న కలెక్టర్ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా, క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. చట్టాన్ని పరిరక్షించి బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కుకూనూర్‌లో అక్రమ నిర్మాణం.. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
X

దిశ, మెదక్ ప్రతినిధి: జిల్లాలోనే అత్యున్నత అధికారిక హోదాలో ఉన్న కలెక్టర్ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసినా, క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. చట్టాన్ని పరిరక్షించి బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలో వెలుగుచూసిన భవన నిబంధనల ఉల్లంఘన వ్యవహారమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గ్రామానికి చెందిన యామవరం రఘువీర శర్మకు చెందిన 40 గజాల స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా, గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే సండ్రు రామచంద్ర రెడ్డి, సండ్రు ప్రతాప్ రెడ్డిలు జీ+2 భవనాన్ని నిర్మించారు. దీనిపై బాధితుడు 'ప్రజావాణి'లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా, తూప్రాన్ డీఎల్‌పీఓ చేత విచారణ జరిపించారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. పంచాయతీ రాజ్ చట్టం-2018 నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి బాధితుడి 40 గజాలతో పాటు, 50 గజాల ప్రభుత్వ స్థలాన్ని, సీసీ రోడ్డు వైపు వదలాల్సిన సెట్‌బ్యాక్స్ పరిధిలో కాంపౌండ్ వాల్, గేటు నిర్మించినట్లు తేలింది. అంతేకాకుండా గ్రామానికి చెందిన 13 మీటర్ల, 3 మీటర్ల డ్రైనేజీ కాలువలపైనే కాంపౌండ్ వాల్ లేపేసి, నీటి సరఫరా చేసే పబ్లిక్ ట్యాప్‌ను కూడా కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు డీఎల్‌పీఓ నివేదిక ఇచ్చారు.

కూల్చివేతకు కలెక్టర్ ఆదేశం

డీఎల్‌పీఓ ఇచ్చిన సమగ్ర నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తీవ్రంగా స్పందించారు. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 90, 94 తో పాటు సెక్షన్ 114 ప్రకారం సదరు అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. పోలీస్ బందోబస్తుతో కూల్చివేత చేపట్టి వెల్దుర్తి ఎంపీఓ పర్యవేక్షణలో కేవలం 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని మే 20నే కుకూనూర్ పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు.అయితే రోజులు గడుస్తున్నా పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓలు కలెక్టర్ ఆర్డర్‌ను కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. అక్రమార్కులకు స్థానిక అధికార పార్టీ నేతల నుంచి గట్టి అండదండలు ఉండటంతో వారి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుడు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) యాదయ్యను ఆశ్రయించగా, కేవలం తూతూమంత్రంగా నాలుగైదు ఇటుకలను తొలగించి చేతులు దులుపుకున్నారని బాధితులు మండిపడుతున్నారు.

కలెక్టర్ ఆదేశాలకే విలువ లేదా?

కుకూనూరులో మా పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. విచారణలో కబ్జా నిజమని తేలి మే 20న కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు లేవు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందన లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి.

- బాధితుడు యామవరం రఘువీర శర్మ

Next Story