వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

by Ratna Kumari |

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.

వరి ధాన్యం కొనుగోళ్లలో  రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రతి రోజు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లుల్లో దించుకుంటే పదిరోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ఈ దిశగా మిల్లర్లు, అధికారులు, వాహన ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై రైతులు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్ లో అంచనాలకు మించి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 390 ప్రారంభించు కోవడం జరిగిందన్నారు.

1 లక్ష 20 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు చెప్పారు. రైస్ మిల్లర్లు అదనంగా హమాలీలను నియమించుకొని దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. ధాన్యం రవాణాకు వాహనాల ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు సన్న బియ్యం పండించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగాలన్నారు. ఏఈవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సన్న రకం వరి ధాన్యాన్ని పండించే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వరి ధాన్యం పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ కే హైమావతి మాట్లాడుతూ... జిల్లాలో 46 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి రాగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే 24,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపికృష్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, జిల్లా కార్మిక శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా తూనికలు, కొలతల అధికారి శివరంజని, ఆర్డీవోలు , ఎమ్మార్వో లు , రైస్ మిల్లర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story