ఎల్‌నినో నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

by Taduka Kalyani |

ఖరీఫ్-2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించింది.

ఎల్‌నినో నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్ : ఖరీఫ్-2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి సూచించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వర్షాల మధ్య ఎక్కువ విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఈ పరిస్థితులు పంటల పెరుగుదల, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు. తగినంత వర్షపాతం నమోదై భూమిలో తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని అన్నారు. కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే పత్తి విత్తనాలు వేయడం మంచిదన్నారు. జూలై 15 వరకు పత్తి సాగుకు అనుకూల సమయం ఉంటుందని పేర్కొన్నారు. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో వరి సాగు చేసే రైతులు సాంప్రదాయ నాటు విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వల్ప కాలిక వరి రకాలైన ఎస్‌ఎస్‌బీఎస్‌బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, డబ్ల్యూజీఎల్-44, జేజీఎల్-1978, ఎంటీయూ-1010, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా వంటి రకాలను సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ, జొన్న, సజ్జ వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే పొలాల్లో తేమను నిల్వ ఉంచేందుకు గట్లు బలపరచడం, కలుపు నివారణ, మల్చింగ్ వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వ్యవసాయ బావులు, చెరువులు, ఫార్మ్ పాండ్లు తదితర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేల పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడాలని సూచించారు. తేమ లేని పరిస్థితుల్లో అధిక ఎరువుల వినియోగాన్ని నివారించాలని వాతావరణ మార్పుల కారణంగా పురుగు, తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు పంటలను తరచూ పరిశీలించాలని, పంట బీమా పథకాలలో నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, డీఏఏటీసీ, ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందజేస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.

Next Story