బ‌తికి ఉన్నా.. ఉపాధి హామి రికార్డుల్లో చ‌నిపోయిన‌ట్టే..!

by Ratna Kumari |   (  Updated:2026-05-14 14:25:33  IST  )

కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్ర‌టిష్టాత్మ‌కంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు.

బ‌తికి ఉన్నా.. ఉపాధి హామి రికార్డుల్లో చ‌నిపోయిన‌ట్టే..!
X

దిశ, కొహెడ : కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్ర‌టిష్టాత్మ‌కంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. గ్రామస్తులకు మెరుగైనా ఉపాధి కల్పనే ధ్యేయంగా జాబ్ కార్డులు ఇప్పించాల్సిన అధికారులు.. ఏకంగా ఉపాధి హామీ కూలీలు చని పోయినట్టు రికార్డు చేయడంతో జాబ్ కార్డులు రద్దు అయిన ఘటన కోహెడ మండలం రాంచద్రాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని రాంచంద్రాపూర్ గ్రామంలో 664 జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 140 జాబ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 140 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. మిగిలిన 524 మందికి జాబ్ కార్డులు లేవని, ఉపాధి హామీ పనులకు పిలవడం మానేశారు. ఈ విషయమై ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లి గ్రామస్తులు విచారించారు. అధికారులు మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దామోదర్ గౌడ్ ఆర్టీఏ కింద దరఖాస్తు ఇవ్వగా.. చనిపోయినట్లు అధికారులు రికార్డు చేయడంతోనే జాబ్ కార్డులు రద్దు అయినట్లు అధికారులు సమాధానం ఇచ్చారు.

కేంద్ర మంత్రి దృష్టికి స‌మ‌స్య

జాబ్ కార్డుల తొలగింపు విషయం పై గ్రామస్తులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేంద్ర సహాయ మంత్రి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు లేఖ‌ రాశారు.

అధికారులు తీరుతో ఉపాధికి దూరం

అధికారుల నిర్వాకంతో 4 సంవత్సరాలుగా గ్రామస్తులు ఉపాధికి దూరం అయ్యారు. చనిపోయినట్లు రికార్డులు చేయడంతో గ్రామంలోని కూలీలు పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

అక్రమాలు జరగడంతో జాబ్ కార్డులు తొలగించాం : ఏపీఎం రంగానాయ‌క్

గతంలో అక్రమాలు జరిగిన సమయంలో కొన్ని జాబ్ కార్డులు తొలగించాం. ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉండటంతో మరి కొందరు పేర్లు తొలగించాం. వీబీ జీ రామ్ జీ పథకంలో కొత్తగా దరఖాస్తు చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందిస్తాం.

Next Story