కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 22 |
కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కంది : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ సారి ఓటమి తప్పదని, దీంతో కేసీఆర్ చేసేది లేక తన మకాన్ని కామారెడ్డికి మార్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. సొంత నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ ను ఈసారి కచ్చితంగా ఓడ కొడతామని బహిరంగంగానే చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో మళ్లీ గద్దెను ఎక్కేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో పేదల భూములను గుంజుకొని పెద్దలకు కట్టబెట్టారని విమర్శించారు. ఒకేసారి పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించడం వెనుక వేరే మతులబు ఉందని, సొంత పార్టీ నాయకుల వద్ద కేసీఆర్ కట్టు పట్టు తప్పడంతోనే ఈ డిక్లరేషన్ చేశారన్నారు.

దళితులకు మూడు ఎకరాల మాట ఎక్కడ..?

సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట వట్టి మోసమేనన్నారు. మూడు ఎకరాలు కాదు కదా ఒక్క ఎకరా కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జీతాలే సరిగా ఇవ్వని వ్యక్తి ఇక ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాడు అని అందరికీ అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక కొంతమంది సర్పంచులు మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరిట నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు ప్రజల డబ్బులు డ్రా చేసుకొని దావతులు ఇవ్వడం విడ్డూరమని మండిపడ్డారు.

కాంగ్రెస్ కు ఓటు వేసిన కేసీఆర్ కి వేసినట్టే..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కు ఓటు వేసిన కాంగ్రెస్ కు ఓటు వేసిన రెండు ఓట్లు కేసీఆర్ కి వేసినట్టేనని ఈటల అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ కేసీఆర్ కు కొంతమంది నాయకులు పని చేస్తున్నారని, వారి గెలుపుకు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ ఇస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కేడర్‌ను పటిష్టం చేశామన్నారు. ఆయా నియోజకవర్గాలలో బీజేపీలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వచ్చి సర్వేలు చేసి వెళ్లారని తెలిపారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని రకాల చర్యలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రాజేశ్వరరావు దేశ్ పాండే, కొండాపురం జగన్, తదితర నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed