ప్రభుత్వ భూమి పై కన్నేసిన అక్రమార్కులు

by Taduka Kalyani |

కాలనీ అభివృద్ధికి, ప్రజలకు మౌలిక సదుపాయాలైన వాటర్ ట్యాంక్, పార్క్ కొరకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.

ప్రభుత్వ భూమి పై కన్నేసిన అక్రమార్కులు
X

దిశ, పటాన్ చెరు టౌన్ : కాలనీ అభివృద్ధికి, ప్రజలకు మౌలిక సదుపాయాలైన వాటర్ ట్యాంక్, పార్క్ కొరకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కాలనీకి సంబంధించిన సుమారు 1040 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేసేందుకు యత్నించిగా చెక్ పెట్టారు హైడ్రాధికారులు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహాదేవపురం కాలనీలోని సర్వే 213, 214 లోని 375 గజాల పార్కు, 665 గజాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించారు. ఈ క్రమంలో వాటర్ ట్యాంక్ కొరకు కేటాయించిన 665 గజాల స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు మొరం వేసుకుని పనులు ప్రారంభించడంతో, గమనించిన కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు వెంటనే హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రంగంలో దిగిన హైడ్రా అధికారులు కబ్జాకు యత్నించిన స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. హైడ్రా సీఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను పాతారు. ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలను కబ్జాకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఒక్క ఫిర్యాదుతో వెంటనే స్పందించిన హైడ్రా సిబ్బంది స్థలాన్ని కబ్జా కాకుండా పరిరక్షించి కంచె ఏర్పాటు చేయడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story