ఎట్టెట్టా.. వాడని కరెంట్‌కు బిల్లా..!? లేకుంటే మీటర్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక

by Ramesh Naini |

కిరాణ షాప్ లో వస్తువులు కొనుగోలు చేయకుండా బిల్లు ఇస్తే ఎలా ఉంటుంది.. హోటల్‌కు వెళ్ళి భోజనం చేయకుండా బిల్లు కట్టమంటే ఎవరైనా కడతారా..? కానీ, విద్యుత్ శాఖ మాత్రం విద్యుత్ వాడకున్నా.. యూనిట్లు వాడకుండా ఉన్నా బిల్లు మాత్రం చెల్లించాల్సిందే అంటుంది.. అది కూడా మినిమం బిల్లు కూడా కాదు ఏకంగా ప్రతి నెల వేల రూపాయలు తీసుకుంటూ వినియోగదారుడి జేబు ఖాళీ చేస్తోంది.

ఎట్టెట్టా.. వాడని కరెంట్‌కు బిల్లా..!? లేకుంటే మీటర్ కట్ చేస్తామని అధికారుల హెచ్చరిక
X

దిశ, మెదక్ ప్రతినిధి : కిరాణ షాప్ లో వస్తువులు కొనుగోలు చేయకుండా బిల్లు ఇస్తే ఎలా ఉంటుంది.. హోటల్‌కు వెళ్ళి భోజనం చేయకుండా బిల్లు కట్టమంటే ఎవరైనా కడతారా..? కానీ, విద్యుత్ శాఖ మాత్రం విద్యుత్ వాడకున్నా.. యూనిట్లు వాడకుండా ఉన్నా బిల్లు మాత్రం చెల్లించాల్సిందే అంటుంది.. అది కూడా మినిమం బిల్లు కూడా కాదు ఏకంగా ప్రతి నెల వేల రూపాయలు తీసుకుంటూ వినియోగదారుడి జేబు ఖాళీ చేస్తోంది. మీటర్ చెడిపోయిందని అంటూ ప్రతి నెల బిల్లులు కట్టాల్సిందే అంటూ చెప్పడం విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మెదక్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ కు చెందిన మిట్టపల్లి రమాదేవి 16607079 మీటర్ పై 9930102247 విద్యుత్ వినియోగం చేస్తోంది. పెద్ద బజార్ లో ఉంటున్న రమాదేవి కుటుంబం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారి పిల్లల చదువుల అవసరాల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి ఉంది. గతంలో మినిమం 100 బిల్లు వచ్చేది.. ఎలాంటి బకాయిలు లేకుండా ప్రతి నెల చెల్లించారు. కానీ, జులై నుంచి విద్యుత్ వాడుకున్నా రూ.1253 బిల్లు వచ్చింది. ఎలా వచ్చిందో తెలియని ఆ కుటుంబం వచ్చిన బిల్లు చెల్లించారు. అదే విధంగా ఆగస్టు మాసంలో కూడా 1278 వచ్చింది. దీంతో అనుమానం వచ్చి స్థానిక లైన్ మెన్, ఏ ఈ దృష్టికి తీసుకు వెళితే మీటర్ చెడిపోయింది.

బిల్లు ఎంత వస్తే అంతే చెల్లించాలి

బిల్లు ఎంత వస్తే అంతే చెల్లించాలని సలహా ఇచ్చారు. దీంతో డిసెంబర్ మాసంలో కూడా రూ.1200 బిల్లు రావడంతో అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన కరువైంది. విద్యుత్ వినియోగం లేకుంటే కేవలం మినిమం రూ.100 బిల్లు మత్రమే రావాలి. కానీ, యూనిట్స్ వాడనట్టు బిల్లులో చూపిస్తున్నా రూ.1200 బిల్లు వస్తోంది. విద్యుత్ మీటర్ లో సమస్య ఉంటే రిపేర్ చేయాల్సిన బాధ్యత ఆ శాఖ పైనే ఉంటుంది. కానీ, ఆరు నెలలుగా అధికారుల దృష్టికి అధిక బిల్లుపై ఫిర్యాదు చేస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాడని కరెంట్ కు బిల్లులు చెల్లించని విద్యుత్ సిబ్బందితో చెబితే కరెంట్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. మీటర్ లో సమస్య ఉంటే పరిష్కరించాల్సింది విద్యుత్ శాఖ అధికారాలు, కానీ సమస్యను వదిలేది బిల్లులు చెల్లించకుంటే కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇంకా ఎన్నాళ్లపాటు బిల్లులు చెల్లించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీటర్లలో సమస్య ఉంటే చేతులెత్తేస్తున్న అధికారులు..

విద్యుత్ మీటర్లలో ఏదైనా సమస్య ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమస్య మాది కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప పరిష్కారం కోసం ట్రాన్స్ కో అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదు. ఒక వేళ విద్యుత్ మీటర్ లో సమస్య ఉందని గుర్తిస్తే మీటర్ కాలిపోయినట్టు ఫిర్యాదు చేసి కొత్త మీటర్‌కు డీడీ చెల్లిస్తే వెంటనే చేస్తున్నారు, కానీ సమస్య ఉన్న మీటర్లు రిపేర్ చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో చాలా చోట్ల ఇలాంటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు వాడని కరెంట్‌కు బిల్లులు చెల్లించాల్సి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మీటర్ లలో లోపాలు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు పై తక్షణ స్పందించి మరమ్మత్తులు చేయించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు మారి మరమ్మత్తులు చేస్తారా లేక మనకెందుకులే అని అదే నిర్లక్ష్యం వహిస్తారా..? చూడాలి మరి. కాగా, మెదక్ ఏడీఈని వివరణ కోరగా మెదక్ కు చెందిన రమాదేవి విద్యుత్ మీటర్ వాడకుండా కరెంట్ బిల్లు వస్తున్న విషయంపై మెదక్ ట్రాన్స్ కో ఏడీఈ మోహన్ బాబు దృష్టికి తీసుకు వెళ్లగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారని వివరించారు.

Next Story