- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాణాలు కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
పటాన్ చెరు పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్ స్థలం కబ్జా చేసే క్రమంలో బుధవారం అర్థరాత్రి కొందరు అక్రమార్కులు కూల్చివేతలు చేపట్టడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : పటాన్ చెరు పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్ స్థలం కబ్జా చేసే క్రమంలో బుధవారం అర్థరాత్రి కొందరు అక్రమార్కులు కూల్చివేతలు చేపట్టడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. కోర్టుల పేరు చెప్పుకుని తప్పుదారి పట్టిస్తున్నారని, ఏ కోర్డు ప్రభుత్వ భూమికాదని చెప్పలేదన్నారు. 1960 నుంచే ఇక్కడ నిర్మాణాలు జరిగాయని, అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. జాతీయ రహదారి రోడ్డు విస్తరణను పనులను అడ్డం పెట్టుకొని వందల కోట్ల విలువ చేసే పాఠశాల భూమిని కబ్జా చేయడానికి చూసిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.300 కోట్ల ప్రభుత్వ భూమికి స్పాట్ శీర్షికన దిశలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన రఘునందన్ రావు పటాన్ చెరు ప్రభుత్వ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో అమలవుతున్న చట్టాలు పటాన్ చెరులో మాత్రం పనిచేయవు అన్నట్టుగా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు చూస్తే అర్థం అవుతుందన్నారు. పట్టణంలో శ్రీనగర్ కాలనీలోని సర్వే నంబర్ 428లో ఉన్న పురాతన పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రే దొంగల్లా కూల్చారని నిప్పులు చెరిగారు. సుమారు 4 ఎకరాల స్థలంలో పాఠశాల మెయింటెనెన్స్ జరుగుతుండేది గుర్తు చేశారు. కొంతమంది అక్రమార్కులు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, కొందరు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారన్నారు.
వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
అర్థరాత్రి కూల్చివేతలు చేసిన ప్రొక్లైనర్లు, ఇతర వాహనాలను సీజ్ చేయాలని, అక్కడ దగ్గరుండి స్కూల్ గ్రౌండ్ లోని పాత నిర్మాణాలను కూల్చివేయించిన వారినిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రఘునందన్ రావు అధికారులకు సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫోన్లు చేసి చేప్పామన్నారు. తాను స్వయంగా స్పందించి అధికారులు చెప్పడంతోనే కూల్చివేతలు ఆపివేసిన వాహనాలు వెళ్లిపోయినట్లు ఎంపీ చెప్పారు. రహదారి నిర్మాణం కోసం రోడ్డు పక్కన డబ్బాలు తొలగిస్తున్నారని, ఆ డబ్బాలకు స్కూల్ ప్రహరిగోడ దూరంగా ఉందన్నారు. గోడ దాటి 10ఫీట్ల దూరంగా గ్రౌండ్ లో ప్రభుత్వ ఆస్తులను ఎలా కూల్చుతారని మండిపడ్డారు.
కలెక్టర్ స్పందించిన తీరు ఏం బాగాలేదు
తాము చెప్పినప్పటికీ, మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు ఏం బాగాలేదని ఎంపీ ఆగ్రహించారు. కలెక్టర్ తక్షణమే స్కూల్ గ్రౌండ్ ను పరిశీలించాలని, పూర్తి స్థాయిలో సర్వే చేయించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని రఘునందన్ రావు కోరారు. స్వయంగా వారు రావాలి తప్ప ఎమ్మార్వోకో ఇతర అధికారులకే చెబుతే పనులు కావన్నారు. జాతీయ రహదారి పనుల కాంట్రాక్టర్లు కూల్చివేతలు చేస్తే వారిపై కేసు చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. కేవలం రోడ్డు పక్కన డబ్బాల తొలగింపు సాకు చూసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. కొందరు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. ఏ కోర్టు అనుమతి ఇచ్చిందో ఆధారాలు చూపించాలని కూల్చివేతలు చేసిన వారికి రఘునందన్ రావు సూచించారు. ప్రభుత్వ భూమికి ఏ కోర్టు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు.
2009లోనే తహశీల్దార్ సర్వే
ఈ భూమి తమదంటూ కొందరు కోర్టుకి వెళ్లగా 2009లోనే అప్పటి తాసీల్దార్ సర్వే చేసి రిపోర్టు ఇచ్చారని రఘునందన్ రావు రికార్డులను మీడియాకు చూపించారు. ఈ భూమిలో కొంతమంది గుడిసెలు ఉన్నాయని కూడా ఆ మ్యాప్ లో పొందుపరిచారని, 428 సర్వే నెంబర్ లో పాఠశాల, ఏ తరగతి ఎక్కడ ఉందో క్షుణ్ణంగా ఉందన్నారు. అదనంగా మరో 2 రూమ్స్ ని కూడా నిర్మించాలని ఆర్డర్ చేసిన కాపీలు కూడా చూపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సమగ్రమైన విచారణ చేపట్టాలని లేనిపక్షంలో ప్రజలందరితో కలిసి ప్రభుత్వ భూమి కాపాడటానికి తానే ముందుండి ప్రత్యక్ష ఆందోళనకి దిగాల్సి వస్తుందని రఘునందన్ రావు హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు అశోక్ కుమార్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






