- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టులో కేసు.. శిథిలావస్థలో బడి..!
ఒకప్పుడు జిల్లాలోనే ఉత్తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటిగా పేరొందిన ఝరాసంగం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది.

దిశ, ఝరాసంగం: ఒకప్పుడు జిల్లాలోనే ఉత్తమ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటిగా పేరొందిన ఝరాసంగం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో ప్రముఖులుగా స్థిరపడ్డారు. ప్రస్తుత జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్‌రావు, మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్ ఇదే గ్రామానికి చెందిన వారే అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వివిధ పాఠశాలలు, గురుకులాలు అభివృద్ధి చెందాయి కానీ సంగారెడ్డి జిల్లా ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు పాఠశాల స్థల వివాదం కోర్టులో ఉండటంతో స్టే అమలులో ఉంది. దీంతో భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బాలబాలికలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో సమీపంలోని వాగు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనం చేసేందుకు భోజనశాల లేక విద్యార్థులు చెట్ల కిందే భోజనం చేస్తున్నారు. ఒకప్పుడు 600 మందికి పైగా విద్యార్థులు చదివిన ఈ పాఠశాలలో ప్రస్తుతం కేవలం 280 మంది మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాలైన కక్కరవాడ, మేదపల్లి, సంఘం (కె), తుమ్మనపల్లి, బొప్పనపల్లి, చిలేపల్లి, చిలేపలి తాండ, గ్రామాలతోపాటు ఎస్సీ బాలుర, బాలికల, బిసి బాలుర వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఈ బడిలోనే విద్యను అభ్యసిస్తారు.
కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వెనక్కి..
'మన ఊరు–మన బడి', మహీంద్రా అండ్ మహీంద్రా సీఎస్‌ఆర్ నిధులు, ఇతర సంస్థల ద్వారా పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన ప్రతిపాదనలు కోర్టు కేసు కారణంగా నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు అమలు కాకుండా వెనుదిరిగాయి.
శిథిలావస్థలో భవనాలు..
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, వంటశాల, గ్రంథాలయం, కంప్యూటర్ గది, ఎన్ సీసీ గది, పాఠశాల ప్రహరీ గోడ తదితర నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 'దిశ' పరిశీలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. చెట్ల కిందే మధ్యాహ్న భోజనం చేయాల్సి వస్తుండగా, చెట్లపై ఉన్న పక్షుల విసర్జన భోజన పాత్రలపై పడుతున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి. తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో శుద్ధజలాన్ని బయట నుంచి కొనుగోలు చేసి పాఠశాలకు తెప్పిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కోర్టు కేసు కారణంగా ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని కోర్టు వివాదానికి త్వరితగతిన పరిష్కారం చూపించి, పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కోర్టు కేసులో ఉంది : ఎంఈఓ శ్రీనివాస్, ఝరాసంగం.
ఝరాసంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థల వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి నిర్మాణాలు గానీ, రంగులు వేయటం గాని, చేయడం లేదు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒకసారి పాఠశాలను సందర్శించారు. పాఠశాల విభాగం ఫైలు కలెక్టర్ వద్ద ఉంది. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం...






