మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా.. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఆందోళన

by Jakkula.Mamatha |

మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడింది.

మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక వాయిదా.. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఆందోళన
X

దిశ, జహీరాబాద్: మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడింది. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ జైత్ రాం ప్రకటించారు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి.

చైర్మన్ గైర్హాజరు పై మండిపాటు..

అర్ధరాత్రి వరకు సమావేశానికి స్వయంగా ఆహ్వానించిన మున్సిపల్ చైర్మన్ గైర్హాజరు కావడంపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ అనారోగ్య కారణాల వల్ల కో -ఆప్షన్ ఎన్నికకు హాజరు కాలేకపోయారని మున్సిపల్ కమిషనర్ సభకు వివరించారు. ఎన్నికకు సరిపడా సభ్యుల బలం లేకపోవడంతోనే, ఓటమి భయంతో చైర్మన్ కావాలనే గైర్హాజరయ్యారని ఎమ్మెల్యే, కౌన్సిలర్లు ఆరోపిస్తూ జరిగిన అవమానంపై మండిపడ్డారు.

కమిషనర్‌తో వాగ్వాదం..

సమావేశం నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, చైర్మన్ రాకపోయినా సభను నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్ ఆరోగ్య సాకు చూపి ఎన్నికను ఎలా వాయిదా వేస్తారని నేతలు కమిషనర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో కమిషనర్‌కు, ఎమ్మెల్యే , కౌన్సిలర్లకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులను పిలిచి అవమానించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

"కాంగ్రెస్ పార్టీలో సభ్యుల ఎంపిక విషయంలో నెలకొన్న అంతర్గత కలహాలు వల్లే ఈ ఎన్నికను కావాలని అడ్డుకుంటున్నారు. కోరం లేదనే సాకుతో ప్రజాస్వామ్య ప్రక్రియను కాలరాస్తున్నారు." - ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. "న్యాయం జరగాలి.. కమిషనర్ సమాధానం చెప్పాలి" అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన వినిపించారు. ప్రస్తుతానికి ఎన్నిక వాయిదా పడటంతో, తదుపరి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

Next Story