మెద‌క్ జిల్లాలో దారుణం.. భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టిన భార్య‌..!

by Ratna Kumari |

వివాహిత సంబంధానికి భ‌ర్త అడ్డువ‌స్తున్నాడ‌ని క‌ట్టుకున్న భార్య ప్రియుడితో క‌లిసి హ‌త మార్చింది. ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటు చేసుకుంది.

మెద‌క్ జిల్లాలో దారుణం.. భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టిన భార్య‌..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఇదేమి దారుణం.. వివాహేతర సంబంధాలు తాళి కట్టిన బంధాలనే కడతేరుస్తున్నాయి. తనకంటే ఐదేళ్ల చిన్నవాడితో భార్య సాగిస్తున్న పాడు బంధాన్ని ఆపేయాలని చెప్పిన పాపానికి ప్రియుడి తో కలిసి గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ వివ‌రాల‌ను వెల్లడించారు. శివ్వంపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన స్వామి ఇల్లరికంగా వచ్చి అదే గ్రామానికి మౌనికలకు ప‌న్నెండేళ్ల‌ క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా మౌనికకు తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన సంపత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనలో తేడా గమనించిన స్వామి ఇలాంటి తప్పుడు పనులు చేసి పరువు తీయకూడదని ఆమెను హెచ్చరించాడు. మరోసారి ఇలా చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెడతానని భార్యను గట్టిగా మందలించాడు.

భర్త అడ్డుగా ఉన్నాడని..

భర్తకు వివాహేతర సంబంధం తెలియడం తో ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మౌనిక, అతడిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2024 డిసెంబర్ 22వ తేదీన రాత్రి స్వామి మద్యం తాగి ఇంటికి వచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సరైన సమయంగా భావించిన మౌనిక, వెంటనే తన ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న స్వామిని గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరక్కుండా ఉండేందుకు నిందితులు మాస్టర్ ప్లాన్ వేశారు. స్వామి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించుకుని ఊరి శివారులోని నెరేళ్లకుంట చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని నీటిలో పడేసి, అతడు మద్యం మత్తులో ఆకస్మాత్తుగా ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు శవం బయటపడటంతో మౌనిక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అందరినీ నమ్మించింది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. కాల్ డేటాతో పాటుగా ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు మౌనికను గట్టిగా ప్రశ్నించగా, అసలు నిజం బయటపడింది. ప్రియుడు సంపత్‌తో కలిసి తనే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. దీంతో పోలీసులు మౌనిక, సంపత్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. తండ్రి మరణించి, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

Next Story