రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి : జగ్గారెడ్డి

by Batti.Sumithra |

ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు.

రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి : జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : ముఖ్యమంత్రి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీవ్ పార్క్‌లో పర్యటించి పనులను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాజీవ్ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేప్ డిజైన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న బ్లాక్ గ్రానైట్ స్థానంలో కొత్త టైల్స్ అమర్చాలని సూచించారు. పార్క్‌లో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్ పాడైపోయిన నేపథ్యంలో ఆధునిక మ్యూజిక్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ సాయంత్రం రెండు పాటలతో ఫౌంటెన్ నడిచేలా ఉండాలని కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సూచించారు.

ప్రస్తుతం మంజూరు చేసిన రూ.3 కోట్లు పునరుద్ధరణ పనులకే సరిపోతాయని అధికారులు జగ్గారెడ్డికి వివరించారు. మ్యూజిక్ ఫౌంటెన్‌తో పాటు 2డీ, 3డీ లేజర్ ఫౌంటెన్లు, అలాగే మిగిలిన పనులన్నిటికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలు బుధవారం లోగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పార్క్‌లో ప్రత్యేకంగా కృత్రిమ పాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పాండ్‌లో పెడల్ బోట్లు ఏర్పాటు చేయాలని, సందర్శకులు కూర్చునేందుకు చుట్టూ బెంచీలు ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. అలాగే పార్క్‌లో ప్రత్యేక స్కేటింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మే 10లోగా పార్క్‌లో గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేయాలని, పార్క్ ముందుభాగంలోని పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డీఈ, నాయకులు తోపాజీ అనంత్ కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story