జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి దొంగ అవ‌తార‌మెత్తిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి

by Ratna Kumari |   (  Updated:2026-04-09 11:06:52  IST  )

జల్సాలకు అలవాటు పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగ అవతారమెత్తాడు. ముగ్గురు స్నేహితులు, మరో ముగ్గురు దోపిడి దొంగలతో కలిసి చోరీకి ప్లాన్ చేసి కటకటాల పాలయ్యారు.

జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి దొంగ అవ‌తార‌మెత్తిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జల్సాలకు అలవాటు పడి ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగ అవతారమెత్తాడు. ముగ్గురు స్నేహితులు, మరో ముగ్గురు దోపిడి దొంగలతో కలిసి చోరీకి ప్లాన్ చేసి కటకటాల పాలయ్యారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా బెల్లంపల్లి కి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ రామగుండం ఐఓసీలో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన శ్రీకాంత్ అలియాస్ క్రాంతి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఈమేరకు హైదరాబాద్ లో ఉంటున్న రామగుండానికి చెందిన త‌న‌ స్నేహితులు రాకేష్, శ్యాం, గోదావరి ఖనికి చెందిన చంద్రశేఖర్ లకు విషయం చెప్పాడు. దోపిడి దొంగతనాలకు పాల్పడుతున్న గణేష్, ప్రేమ్ చంద్, పవన్ లను కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి సహకారంతో పట్టణ శివారు చేర్విత మెడోస్ ఓ ఇంటిలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.


2026 ఏప్రిల్ 4న చంద్రశేఖర్ ఇంటి బయట ఉండగా.. కల్లూరి గణేష్, ప్రేమ చందు, పవన్ లు ఇంటిలోకి ప్రవేశించి కత్తులతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్ల చేతులు కట్టేసి భయబ్రాంతులకు గురి చేసి బంగారు పుస్తెల తాడులు, చైన్, కమ్మలు, లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు దొంగతనానికి పాల్పడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 10 టీమ్ లను ఏర్పడి 72 గంటల లోపు కేసు ఛేదించారు. దొంగతనం కేసులో కీలక నిందితులు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీకాంత్, రాజేష్, శ్యాం, చంద్రశేఖర్, గణేష్, ప్రేమ్ చంద్, పవన్ లను, దొంగలించిన సొత్తును తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన ప్రకాష్, వినయ్ లను అరెస్టు చేశారు. వీరి వద్ద 4.6 తులాల బంగారం, కారు, బైక్, 10 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. భద్రాద్రి, ములుగు జిల్లాల పరిధిలోని పోలీసు స్టేషన్ల పరిధిలో గణేష్ పై 13 కేసులు, పవన్ పై 10 కేసులు ఉన్నాయి. కేసు ఛేదన లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐలు రాజేశ్ (సిద్దిపేట రూరల్), చంద్రమోహన్ ( చిన్నకోడూరు), వివేక్ (రాజగోపాల్ పేట), సౌజన్య ( బెజ్జంకి), పోలీసు సిబ్బంది రాజు, సుభాష్, యాదగిరి, స్వామి లను పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.

Next Story