పేరుకే 100 పడకలు.. రోగులకు తప్పని అవస్థలు

by Kodari Anjali |

తెలంగాణ, కర్ణాటక రోగులకు దిక్కైన ఆసుపత్రిలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.

పేరుకే 100 పడకలు.. రోగులకు తప్పని అవస్థలు
X

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో.. అదో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. రోజుకు సగటున వెయ్యి మందికి పైగా రోగులు ఓపీ సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. నెలకు 300కు పైగా ప్రసవాలు (కాన్పులు) చేస్తూ రాష్ట్ర స్థాయిలోనే అరుదైన గుర్తింపు సొంతం చేసుకుందీ ఆ ఆసుపత్రి. తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా వందలాది మంది పేద రోగులు ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. కానీ, ఇంతటి ఘన చరిత ఉన్న ఈ ఆసుపత్రికి ఇప్పుడు తీవ్ర ‘సిబ్బంది కొరత’ అనే పెద్ద రోగం చుట్టుముట్టింది. ఫలితంగా పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందక ‘అందని ద్రాక్ష’లా మారుతోంది.

సగం మందితోనే నెట్టుకొస్తున్నారు..!

ఈ ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 130 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం సగం కంటే తక్కువగా, కేవలం 71 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న అరకొర సిబ్బందే ఊపిరి సల్పకుండా పనిచేస్తున్నా.. రోగుల రద్దీకి తగ్గట్టు సేవలు అందించడం వారి వల్ల కావడం లేదు. వైద్యుల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తం 50 మంది వైద్యులకు గాను కేవలం 19 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిలో నలుగురు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లగా, ఒకరు సస్పెండ్ అయ్యారు.

పోస్టులు ఖాళీ.. వైద్యం గాలికి!

ఆసుపత్రిలోని కీలక విభాగాల్లో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.. ఆసుపత్రిలో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్లు 15 మందికి గాను 8 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ సివిల్ సర్జన్లు 10 మందికి గాను 3 పనిచేస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 25 మందికి గాను 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ముగ్గురు డిప్యూటేషన్లో ఉన్నారు. దీంతో వైద్యం సక్రమంగా అందడం లేదు. విధుల్లో ఉన్న కొద్దిమంది వైద్యులపైనే పనిభారం పడటంతో రోగులకు నాణ్యమైన చికిత్స అందడం గగనంగా మారింది.

గైనకాలజిస్టులు లేరు..

నెలకు 300కు పైగా కాన్పులు జరిగే ఈ ఆసుపత్రిలో ప్రభుత్వ గైనకాలజిస్టులు (స్త్రీ వైద్య నిపుణులు) ఇద్దరు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిన ముగ్గురిని తీసుకుని ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అయితే, ఇక్కడి ఓపీ, లేబర్ రూమ్, నైట్ డ్యూటీలు, సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ఆపరేషన్లు సవ్యంగా సాగాలంటే కనీసం 5 గురు గైనకాలజిస్టులు అవసరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Next Story