ప్రభుత్వం అనుమతితోనే యూనియన్ల పునరుద్ధరణ.. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఎండీ నాగిరెడ్డి

by Ramesh Naini |

టీజీఎస్ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ అంశం యాజమాన్యం పరిధిలో లేదని, ప్రభుత్వం అనుమతితో యూనియన్ల కార్యకలాపాలను అనుమతిస్తామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

ప్రభుత్వం అనుమతితోనే యూనియన్ల పునరుద్ధరణ.. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఎండీ నాగిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ అంశం యాజమాన్యం పరిధిలో లేదని, ప్రభుత్వం అనుమతితో యూనియన్ల కార్యకలాపాలను అనుమతిస్తామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ శుక్రవారం బస్ భవన్ లో ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 22 డిమాండ్లతో కూడిన అంశాలపై సుదీర్ఘంగా ఎండీతో చర్చించినట్లు తెలిపారు. 2017 వేతన సవరణకు చెందిన అలవెన్సులు పెంచి చెల్లించేందుకు ఎండీ సానుకూలంగా స్పందించారని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. కారుణ్య నియామకాలను 3 సంవత్సరాల పాటు కన్సాలిడేటెడ్ పే కింద పని చేసే విధానాన్ని 2 సంవత్సరాలకు మారుస్తామని, 2021 వేతన సవరణను వీలైనంత త్వరలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వీలైనంత త్వరగా చెల్లిస్తామని, మహాలక్ష్మి పథకంలో ప్రయాణిస్తున్న మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. కార్మికులపై పనిభారాలు తగ్గిస్తామని, జనం లేని రూట్లలో కిలోమీటర్లను తగ్గిస్తామని, కారుణ్య నియామకాల వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచడానికి బోర్డు అనుమతి కోరుతామని తెలిపారన్నారు. తార్నాక హాస్పిటల్ లో రోగులతో పాటు వచ్చే అటెండెంట్స్ కి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, త్వరలో విశ్రాంతి భవనం నిర్మించి అందులో డైనింగ్ హాల్ ను ఏర్పాటు చేస్తామని ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ప్రైవేటు వాహనాల రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు చేపడతామని ఎండీ తెలిపారన్నారు. యాజమాన్యం పరిధిలో ఉన్న సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినందుకు ఎండీకి వారు జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ నేతలు ఎన్.కమలాకర్ గౌడ్, జె.రాఘవులు, బుద్ధ విశాల్, ఎం.ఎ.మజీద్, జి.రాములు, జి.రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story