నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసే కుట్ర.. వారసులు లేని ఆస్తికోసం మాస్టర్ ప్లాన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-25 02:22:25  IST  )

నాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, వెల్టూరు గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కాజేసేందుకు చేస్తున్న కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నకిలీ డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసే కుట్ర.. వారసులు లేని ఆస్తికోసం మాస్టర్ ప్లాన్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, వెల్టూరు గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కాజేసేందుకు చేస్తున్న కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్టూరు గ్రామపంచాయతీ గేటు వద్ద, శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అత్యంత విలువైన 39 గుంటల (రూ. 4 కోట్లకు పైగా) వ్యవసాయ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో కొందరు 'ఘనులు' తమ పేరిట పట్టా చేయించుకున్నారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వారసులు లేని ఈ భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నా, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా పట్టా, నాలా కన్వర్షన్​ ప్రయత్నాలు

వెల్టూరు గ్రామానికి చెందిన పుణ్యమూర్తి సత్యమ్మ పేరున సర్వే నెంబర్ 213/ఏబీ/1/1/1లో 26 గుంటలు, 213 ఏబీ/1/1లో 13 గుంటలు (మొత్తం 39 గుంటలు) భూమి ఉంది. సత్యమ్మ 2012లో మరణించగా, ఆమెకు వారసులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలోనే, కోట్లాది విలువైన ఈ భూమిపై కొందరు కన్నేశారు. రెవెన్యూ అధికారులను లోబరుచుకుని అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించి, తమ పేరిట పట్టా చేయించుకున్నారు. ఇప్పుడు ఈ భూమిని నాలా కన్వర్షన్ చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించి కోట్లు గడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

'డబుల్' రిజిస్ట్రేషన్ల దందా!

కోట్ల విలువైన ఈ భూమి చేతులు మారడంలో ఉప్పునుంతల మండల రెవెన్యూ అధికారుల తప్పిదమే ప్రధాన కారణంగా గ్రామస్తులు బలంగా ఆరోపిస్తున్నారు. సత్యమ్మకు చెందిన 26 గుంటల భూమిని అచ్చంపేట మండలం, పలకపల్లికి చెందిన బొల్లె పోగు మురళీధర్ పేరున ఉప్పునుంతల రెవిన్యూ అధికారులు 118/2011 నెంబర్‌తో రిజిస్టర్ చేశారు. అయితే, ఇదే 118/2011 రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే తాడూరు గ్రామానికి చెందిన పి. జంగయ్యకు అచ్చంపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో (1401 నెంబర్‌తో) రిజిస్ట్రేషన్ చేయడం రెవెన్యూ అధికారుల అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అలాగే, మూడవత్ రామాజీ అనే వ్యక్తికి సర్వే నెంబర్ 213 ఏబీ/1/1లోని 13 గుంటల భూమిని 945/1996 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నిబంధనల ప్రకారం.. పత్రాల డాక్యుమెంటరీ పరిమితి 13 సంవత్సరాల వాల్యుయేషన్ పరిధిగా ఉండగా, ఈ నిబంధనలను సైతం ఉల్లంఘించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం గమనార్హం.

జీపీకి కేటాయింపులో జాప్యం: ఆందోళనకు సిద్ధం..

వారసులు లేని ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా గ్రామపంచాయతీకి కేటాయించాలని గ్రామస్తులు గతంలోనే అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు జూన్ 9, 2025న అప్పటి తహసీల్దార్‌కు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు నేటికీ ఈ భూమిని గ్రామపంచాయతీకి కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూమిని గ్రామపంచాయతీకి కేటాయించాలని వెల్టూరు గ్రామానికి చెందిన అమరేందర్ రెడ్డి, గుద్దటి బాలరాజు, చింతజి వెంకట్ ప్రహ్లాద్, మాజీ సర్పంచ్ మేడ జంగయ్య తదితరులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

Next Story