- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమానికి రాజకీయ రంగు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎవరికి నష్టం?
సోషల్‌మీడియాలో ఇటీవల ఓ వైపు గో బ్యాక్ మార్వాడీ.. మరో వైపు గో బ్యాక్ రోహింగ్యాలు అంటూ కొనసాగుతున్న ప్రచారం బాగా వైరలవుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్‌మీడియాలో ఇటీవల ఓ వైపు గో బ్యాక్ మార్వాడీ.. మరో వైపు గో బ్యాక్ రోహింగ్యాలు అంటూ కొనసాగుతున్న ప్రచారం బాగా వైరలవుతున్నది. ఇటు సామాజిక ఉద్యమకారులు, అటు రాజకీయ పార్టీ నాయకుల కూడా స్పందిస్తుండటంతో ప్రజల్లో కూడా చర్చ నడుస్తున్నది. ఈ పరంపరలో ‘మార్వాడీ వ్యాపారులు గో బ్యాక్’ అంటూ ఈ నెల 18న రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో స్థానిక వ్యాపారవర్గాల వారు బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ అంశం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమనగల్లు వ్యాపారవర్గాలు తమ ఆవేదన, ఆరోపణలను మీడియాలో వ్యక్తపరుస్తున్నాయి. పట్టణపరిసర ప్రాంతాల్లో మార్వాడీలు వ్యాపారాలు పెంచుకుంటూ తక్కువ ధరలో వస్తువులను అమ్మడంతో తమ వ్యాపారాలు నడవడం లేదని, వారి వ్యాపార షాపుల్లో వారి మనుషులనే నియమించుకోవడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు రావడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదనతోనే ఈ బంద్నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే సోషల్‌మీడియాలో చాలా మంది మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ చోట్లా మార్వాడీలే ఉంటున్నారని, తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని, ప్రతి చిన్న ఊరిలోకి వచ్చి వ్యాపారాలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఇది కాస్త ప్రధాన మీడియాలో కూడా చర్చకు దారి తీసింది. ఈ అంశం మరింత చర్చల్లోకి వచ్చేందుకు కొన్ని సంఘటనలు ఊతం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇటీవల సికింద్రాబాద్మోండా మార్కెట్లో స్థానిక వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ వివాదానికి దారితీసింది. ఈ ఘటన ‘మార్వాడీ గో బ్యాక్’ చర్చకు మరింత ఊతమిచ్చినట్లయింది. తెలంగాణ శ్యాం అనే యువకుడు మాట్లాడిన మాటలు, గోరటి రమేష్అనే గాయకుడు ఈ అంశంపై పాడిన పాట కూడా బాగా వైరలైనట్లు సోషల్‌మీడియాను ఫాలో అవుతున్న వారు చెబుతున్నారు. రమేష్ ను పోలీసులు అరెస్ట్చేయడం కూడా ఈ అంశం మరింత చర్చకు దారితీసింది.
మార్వాడీలు ఏమంటున్నారు
ఈ అంశంపై ఎవరికి వారే తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా గో బ్యాక్నినాదానికి మద్దతుగా ఉన్న వారి వాదన ప్రకారం తెలంగాణలో తమ వ్యాపారాలను వీరు వృద్ధి చేసుకొని స్థానికంగా ఆధిపత్యాన్ని చేస్తున్నారని, తెలగాణ సంస్కృతి సంప్రదాయాల్లో వారి సంప్రదాయాల, సంస్కృతిని పైచేయిగా ఉండేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గో బ్యాక్‌కు వ్యతిరేకంగా ఉన్న వారి వాదన వీరి వాదనను కొట్టి పారేస్తున్నారు. తాము ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంటున్నామని, వ్యాపారాలు చేసుకుంటున్నామని, తమ వల్ల ఎలాంటి ఆందోళన స్థానికులకు ఉండొద్దంటున్నారు. తెలంగాణ వారు దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ లక్షల్లో నివసిస్తున్నారని, వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఎవరైనా ఈ దేశపౌరులేనన్న విషయాన్ని ‘గో బ్యాక్’ అనే వారు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.
రాజకీయ రంగు!
వాద, వివాదాలు ఎలా ఉన్నా ‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ సోషల్‌మీడియాలో వైరలవడంతో అది కాస్త రాజకీయ రంగును పులుముకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై రాజకీయ నేతలు మాట్లాడకుండా ఉండటం లేదు. ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఒకవర్గం వారు నిర్వహించే కులవృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రోహింగ్యాలు ఎంతోమంది పాతబస్తీని అడ్డాగా చేసుకున్నారని ఆరోపించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని, వారు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని బండి సంజయ్ తెలిపారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. ఇదే అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్మహేష్కుమార్గౌడ్మాట్లాడుతూ మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్లాంటి వారు మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్మాత్రం వారి విషయంలో స్పందించలేదు. మీడియాలో జరుగుతున్న చర్చ, నేతల స్పందన తీరు చూస్తుంటే ఈ పరిణామం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది.






