అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: గేటు ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-18 04:42:06  IST  )

తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: గేటు ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే, అసెంబ్లీ గేటు వద్దే మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, సభ లోపలికి ఇటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదని మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలకు అసెంబ్లీ ఆవరణలో తావులేదని స్పష్టం చేశారు.

రైతులంటే అంత చులకననా? - బీఆర్ఎస్ ఆగ్రహం

మార్షల్స్ ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నేతలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "రైతు పండించిన పంటను అసెంబ్లీ లోపలికి తీసుకెళ్తే తప్పేంటి? రైతు ప్రాతినిధ్యం వహించే ఈ సభలో రైతుల పంటకు అనుమతి లేదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనీయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. రైతులంటే ప్రభుత్వానికి అంత చులకననా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అన్నదాతల ఆవేదనను వినిపించేందుకు వస్తే మార్షల్స్‌ను అడ్డుపెట్టి నోరు నొక్కేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాసేపు అసెంబ్లీ గేటు వద్దే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Next Story