- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెటింగ్ శాఖలో నకిలీ బిల్లుల దందా: సాఫ్ట్‌వేర్ లోపాలతో ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లలో గండి!
తెలంగాణ మార్కెటింగ్ శాఖలో సాఫ్ట్‌వేర్ లోపాలతో నకిలీ బిల్లుల దందా.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల గండి, ఫోరెన్సిక్ ఆడిట్‌కు డిమాండ్!

దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెటింగ్ శాఖలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. శాఖలో అవినీతి, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రైతులు, వ్యాపారులు డబ్బులు చెల్లిస్తున్నా.. ప్రభుత్వానికి చేరడం లేదు. ఈ అక్రమాలను నియంత్రించాల్సిన మార్కెటింగ్‌శాఖ అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై అవినీతి తతంగాన్ని నడిపిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ లోపాలు..
గతంలో వ్యవసాయ మార్కెట్‌లలో మార్కెట్ఫీజును ముద్రించిన పుస్తకాల రూపంలో తెచ్చి రసీదులు ఇచ్చేవారు. అయితే, కొందరు ఉద్యోగులు నకిలీ పుస్తకాలను ముద్రించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. ఇలాంటి పలు ఘటనలు వెలుగుచూడటంతో రసీదుల స్థానంలో కొత్త విధానం తెచ్చారు. 2019 మే నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ-సర్వీసు సాఫ్ట్‌వేర్‌ను వాడటం ప్రారంభించారు. ఎల్ఐఎల్ప్రాజెక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ అనే సంస్థ ఆ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించేది. దీని ద్వారానే మార్కెట్, లైసెన్స్ ఫీజులను వసూలు చేసేవారు.
అలా వచ్చిన ఆదాయాన్ని పీడీ ఖాతా ద్వారా ప్రభుత్వ ఖజానాలో జమ చేసేవారు. ఈ విధంగా ప్రతిఏటా మార్కెటింగ్‌శాఖకు రూ.800 నుంచి రూ.850 కోట్ల వరకు ఆదాయం సమకూరేది. క్రమేణా మెయింటెన్స్ సరిగా లేక సాఫ్ట్‌వేర్‌లో లోపాలు వచ్చాయి. ఫలితంగా కొందరు ఉద్యోగులు చేతివాటం మొదలెట్టారు. వీరికి మార్కెటింగ్ శాఖ హెడ్ ఆఫీస్ లో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో దోపిడీ మరింత పెరిగింది. సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేయకుండా కొందరు దోచిన మొత్తంలో ఆయనకు వాటా వెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
నో క్యూ ఆర్ కోడ్..
థర్మల్ రసీదులపై క్యూఆర్‌కోడ్ లేకపోవడంతో అది నిజమైనదా? డూప్లికేటా? అని నిర్దారించే అవకాశం లేకుండా పోయింది. థర్మల్ పేపర్‌పై ముద్రించిన ప్రింట్ కొద్ది రోజులకే పోతుంది. ఏడాది తర్వాత తర్వాత మినహాయింపుల కోసం వ్యాపారులు సమర్పించినప్పుడు ముద్రణ పోవడంతో వాటిని చదవడం వీలు కావడం లేదు. ఇక ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లోనూ ఒక మార్కెట్‌కమిటీ ఫీజును మరొక మార్కెట్‌కమిటీ ఆన్‌లైన్‌లో పరిశీలించే అవకాశం ఇక్కడ లేదు. ఫలితంగా ఇప్పటికే జారీ చేసిన రసీదు నెంబర్ మీద మరొక మార్కెట్పరిధిలోని వ్యాపారికి డూప్లికేట్రసీదులు జారీ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ విధంగా మార్కెటింగ్ శాఖలో అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం. దానికి తోడు ప్రభుత్వ ఆదాయం వివరాలు సాఫ్ట్‌వేర్‌లోనూ ఎప్పటికప్పుడు దొరకడం లేదని తెలుస్తోంది.
నకిలీ బిల్లులు..
ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ పరిధిలో 2021లో చెక్‌పోస్టు సిబ్బంది రూ.11లక్షల ప్రభుత్వ ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయకుండా దుర్వినియోగం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నా... ఇదే తరహాలో ఇతర మార్కెట్ కమిటీలో ఏమైనా జరిగాయనే కోణంలో ఎక్కడా విచారణ జరగలేదు. నిర్మల్ మార్కెట్ కమిటీలో గణేశ్అనే వ్యక్తి ఐ ఫోన్‌ను ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆసరాగా చేసుకొని ఇప్పటికే జారీ చేసిన రసీదుల వివరాలను సునాయాసంగా మార్ఫింగ్ చేసి నకిలీ రసీదులు తయారు చేసి వ్యాపారులకు ఇవ్వడంతో కేసు ఫైల్ అయింది. మహబూబాబాద్, మక్తల్, నారాయణ్‌ఖేడ్, మేడ్చల్, మద్దూరు తదితర మార్కెట్లపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయినా వాటిపై ఎలాంటి విచారణ జరగలేదు. ఇబ్రహీంపట్నం మార్కెట్‌లో ఓ వ్యాపారి మేడ్చల్ మార్కెట్పేరిట ఉన్న రసీదులతో రూ.2 లక్షల మినహాయింపును సమర్పించగా అది డూప్లికేట్ బిల్లులుగా హెడ్ ఆఫీసు ఉద్యోగులు తేల్చారు.
ఫైనాన్షియల్ ఆడిట్ అవసరం..
2019 నుంచి ఇప్పటివరకు అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ‘ఈ-సర్వీస్’ సాఫ్ట్‌వేర్ ద్వారా జారీ చేసిన రసీదులు, ట్రెజరీ జమలు, మార్కెట్ ఫీజు మినహాయింపులపై స్వతంత్ర ఐటీ, ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ఆడిట్ నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో వందల కోట్ల విలువైన అవినీతి, అక్రమాలు, తప్పులు బిల్లులు అన్ని బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఎఎంసీలలో రసీదులు, ట్రెజరీ జమలు, మార్కెట్ ఫీజు మినహాయింపుల మధ్య పూర్తి రీ కన్సిలియేషన్ నిర్వహించి ప్రభుత్వానికి జరిగిన వాస్తవ ఆదాయ నష్టాన్ని నిర్ధారించాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్చేస్తున్నారు.
అన్ని ఎఎంసీలకు ఆన్‌లైన్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తేవడం ద్వారా ఒకసారి మినహాయింపు పొందిన రసీదు మరల మినహాయింపునకు ఉపయోగించకుండా సాఫ్ట్‌వేర్‌లో తగిన మార్పులు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నా్యి. థర్మల్ రసీదుల స్థానంలో క్యూఆర్కోడ్ఆధారిత శాశ్వత డిజిటల్ లేదా సాధారణ కాగితం రసీదు విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ పర్యవేక్షణ లోపాల నివారణలో బాధ్యత వహించిన అధికారులు, సాంకేతిక అధికారుల పాత్ర పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.






