- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిత్ షా వ్యూహం.. ఆపరేషన్ కగార్ ఫలితం: ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్ణయం!
దేశంలో దశాబ్దాల కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణచివేసినట్టు చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో దశాబ్దాల కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణచివేసినట్టు చాటిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 31 తర్వాత ఏ రోజైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ సభను నిర్వహించాలని కేంద్ర హోం శాఖ యోచిస్తోంది. సభకు ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తోంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అంతర్జాతీయ సమాజానికి వివరించడమే లక్ష్యంగా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ సభలో ఇప్పటివరకు లొంగిపోయిన 3 వేలకు పైబడిన మాజీ మావోయిస్టులను, ప్రభుత్వానికి వారు అప్పగించిన వందలాది అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శనకు ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలా? లేక మావోయిస్టులకు కంచుకోటగా ఉండి ప్రస్తుతం ప్రశాంతంగా మారిన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ లేదా బస్తర్ హెడ్ క్వార్టర్ అయిన జగదల్‌పూర్‌లో నిర్వహించాలా? అనే అంశంపై కసరత్తు జరుగుతోంది.
అమిత్ షా వ్యూహం.. ఆపరేషన్ కగార్ ఫలితం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో రచించిన కఠిన వ్యూహాలు మావోయిస్టు మూలాలను దెబ్బతీశాయి. 2024 జనవరిలో ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభమైనప్పుడు 2025 చివరికల్లా బస్తర్, ప్రత్యేకించి అబూజ్‌మాడ్ ప్రాంతాల నుంచి మావోయిస్టులను పారదోలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. 2025 మే నాటికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక కమాండర్లు భద్రతా బలగాల దాడుల్లో మరణించడమో లేక లొంగిపోవడమో జరిగిన పరిస్థితుల్లో ‘మావోయిస్టు ముక్త్ బస్తర్’ లక్ష్యం కాస్తా ‘మావోయిస్టు ముక్త్ భారత్’గా మారింది.
కగార్‌లో భాగంగా ఆ తర్వాత భద్రతా బలగాలు తమ కూంబింగ్‌ను, చుట్టివేత దాడులను మరింత తీవ్రం చేసి మరిన్ని విజయాలు సాధించాయి. ఈ మార్చి 12 నాటి గణాంకాల ప్రకారం.. మావోయిస్టు పార్టీ నిర్మాణాలు, సైనిక విభాగాలు దాదాపుగా తుడిచి పెట్టుకుపోయాయి. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల సభ్యులు, బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు అనేక మంది మరణించడమో లేక లొంగిపోవడమో జరిగింది.
రాజకీయ ప్రాధాన్యత..
గతంలో 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని పనిని తాము సాధించామని చెప్పుకోవడం బీజేపీకి ఇప్పుడు రాజకీయంగా కలిసివచ్చే అంశం. ఇప్పటివరకు లొంగుబాటు కార్యక్రమాలన్నీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, కింది స్థాయి అధికారుల సమక్షంలోనే జరిగాయి. ఆ క్రెడిట్ అంతా రాష్ట్రాలకే దక్కింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో లేదంటే హోం మంత్రి అమిత్ షా సమక్షంలో దేశస్థాయిలో ఈ భారీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా, అంతర్గత భద్రత విషయంలో కేంద్రం సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.






