Maoists: డీజీపీ ఎదుట బర్సీ దేవా, కంకణాల రాజిరెడ్డితో సహా 20 మంది మావోయిస్టుల సరెండర్

by Prasad Jukanti |

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Maoists: డీజీపీ ఎదుట బర్సీ దేవా, కంకణాల రాజిరెడ్డితో సహా 20 మంది మావోయిస్టుల సరెండర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఎదుట 20 మంది మావోయిస్టు కీలక నేతలు (Maoist Surrenders) లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాస్ రేమతో పాటు మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PLGA Battalion) చీఫ్ బర్సే దేవా అలియాస్ సుక్కతో పాటు మొత్తం 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది, టీఎస్‍సీ నుంచి 3, ఎస్ఎస్‌జెడ్‌బీ నుంచి 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (దక్షిణ & పశ్చిమ బస్తర్ డీవీసీ) నుంచి 5 మంది ఉన్నారు. వీరి నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్‌జీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద ఉన్న రూ. 20 లక్షలను బార్సె దేవా స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)కి అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులను ఇవాళ మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదే కావడం విశేషం. అలాగే డీజీపీ శివధర్‌రెడ్డి నేతృత్వంలో అదిపెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. కాగా, రేపు మరో 20 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం.

తెలంగాణ నుంచి 17 మందే..

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ, పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కొలాప్స్ అయిందన్నారు. పీఎల్‌జీఏ బెటాలియన్‌లో అన్ని ర్యాంకులతో కలిపి 400 మందికి పైగా ఉండేవారని, కానీ ఇప్పుడు 66 మంది వరకు మాత్రమే ఉన్నారన్నారు. కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ సరెండర్‌తో తెలంగాణ స్టేట్ కమిటీ ఆల్ మోస్ట్ కొలాప్స్ అయిపోయిందని, ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారన్నారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు ఇప్పటివరకు 55 మంది ఉన్నారని భావించామని, కానీ తాజాగా లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం నుంచి నుంచి కేవలం 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని తెలిపారు. ఇందులో కేంద్ర కమిటీలో నలుగురు, స్టేట్ కమిటీలో ఐదుగురు, డివిజనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ఏరియా కమిటీ మెంబర్లు నలుగురు, పీఎంఎస్ ఒక్కరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసం పట్ల ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు.

Next Story