పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

త్వరలో మల్లారెడ్డి కుటుంబం పార్టీ మారబోతోందనే ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్‍గా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS Party) నేత మల్లారెడ్డి (Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన త్వరలో పార్టీ మారబోతున్నారని, ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇవాళ అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు నా వయసు 73 ఏళ్లు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ముగిపోయే పడవలో ఎవరైనా చేరుతారా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదన్నారు. రేవంత్ రెడ్డి 11 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా.. అది మునిగిపోయే పడవనే అంటూ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని, మొన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నా పెళ్ళిరోజు వేడుకలకు ఆహ్వానించినట్టు చెప్పారు.

మల్లారెడ్డి కోడలు వ్యాఖ్యలు వైరల్:

మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చురుగ్గా కనిపిస్తున్న ప్రీతి రెడ్డి తాజాగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే హైదరాబాద్‍ను భాగ్యనగరంగా మార్చాలనే తెలంగాణ బీజేపీ (BJP) కీలక డిమాండ్‍ను ఆమె సమర్ధించారు. దీనికి తోడు గతంలో ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్‍తో భేటీ కావడం అప్పట్లోనే సంచలనం అయింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‍తో భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి మల్లారెడ్డి ఫ్యామిలీ కుదిరితే బీజేపీ లేదా కాంగ్రెస్‍లో‍కి జంప్ కాబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తాజాగా ఖండించారు.

Next Story