బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి: కమలం గూటికి మల్లారెడ్డి కుటుంబం?

by Kema Shiva Kumar |

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది.

బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి: కమలం గూటికి మల్లారెడ్డి కుటుంబం?
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ రాజకీయాల్లో బలమైన పట్టున్న మల్లారెడ్డి కుటుంబం త్వరలో 'కాషాయ' కండువా కప్పుకోబోతుందా? అనే సందేహాలకు బలం చేకూర్చేలా తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇవాళ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే నెలలో తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సుమారు లక్ష మందితో నిర్వహించ తలపెట్టిన ‘వందేమాతరం’ ఆలాపన కార్యక్రమానికి సంబంధించి చర్చించేందుకే ఆమె వచ్చారని ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, మరోవైపు రాజకీయాల్లో ఇలాంటి భేటీలు కేవలం సామాజిక కార్యక్రమాలకే పరిమితం కావనే చర్చ జరుగుతోంది.

మల్లారెడ్డి ఫ్యామిలీ ‘రూట్’ మారుతోందా?

ఇటీవలే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల క్రితం కూడా స్టేట్ బీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావుతో ఆమె భేటీ అయ్యారు. అప్పటి నుంచే మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై మల్లారెడ్డి ఇప్పటివరకు నేరుగా స్పందించనప్పటికీ, ఇప్పుడు ప్రీతిరెడ్డి స్వయంగా బీజేపీ ఆఫీస్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం ప్రీతిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడితే.. ఇది కేవలం కాలేజీ కార్యక్రమం కోసమేనా లేక రాజకీయ రంగప్రవేశం కోసమా అన్నదానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కోడలి రాజకీయ అరంగేట్రానికి స్కెచ్..

మల్లారెడ్డి కుమారుడు భద్రా‌రెడ్డి భార్య అయిన ప్రీతిరెడ్డి గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో చురుగ్గా తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె విద్యా సంస్థల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మల్లారెడ్డి వయసు రీత్యా రాజకీయాలకు దూరమవ్వాలని భావిస్తుండటంతో తన వారసురాలిగా కోడలిని రాజకీయ అరంగేట్రానికి స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే ప్రీతిరెడ్డి నియోజకవర్గంలోని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తన మాటతీరుతో ప్రజలను ఆకట్టుకుంటూ రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలను ప్రదర్శిస్తున్నారు.

Next Story