ఏసీపీ, సీఐ ముందే కోడిగుడ్లతో దాడి.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గూండాలు బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడ్డారని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఏసీపీ, సీఐ ముందే కోడిగుడ్లతో దాడి.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గూండాలు బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడ్డారని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ కార్యాలయంలో అందరం కూర్చుంటే ఉద్దేశ్యం పూర్వకంగా ఇంటి ముందుకు 100 మంది కాంగ్రెస్ గూండాలు వచ్చి గొడవ సృష్టించారని తెలిపారు. శనివారం దాడి ఘటనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శ్రావణ్ కుమార్, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి సీపీ రమేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలలో పెద్దగా పాటలు పెట్టి కావాలనే ఇబ్బంది కలిగించారు. ఇంటి ముందు పాటలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అడిగినందుకు బీఆర్ఎస్ నాయకులతో కావాలనే గొడవకు దిగారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తన గ్యాంగ్‌తో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలను భౌతికంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ, సీఐల ముందే కోడిగుడ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకోలేదు.మా గన్‌మెన్లు రక్షణగా లేకుంటే తనపై కూడా దాడి చేసేవారని వెల్లడించారు. దాడులను ఖండిస్తూ వజ్రేష్ యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.

రౌడీ రాజ్యంగా తెలంగాణ

ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగాల్సిన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఒక రౌడీ రాజ్యంగా మారిందని ఎమ్మెల్సీ డా. దాసోజు విమర్శించారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భూతపురాణాలతో రెచ్చిపోయి దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.కనీస రాజకీయ సంస్కారం లేకుండా మాజీ మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. అదేవిధంగా క్యాతనెపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్ రావుపై దాడి యత్నం జరగడం కాంగ్రెస్ పార్టీ గుండాగిరికి నిదర్శనమన్నారు. స్పీకర్ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇనానిమస్‌గా ఎన్నికైన అభ్యర్థులను బెదిరించడం, బలవంతంగా బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విత్‌డ్రా చేయించడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు. కోడంగల్‌లో కూడా ఇదే తరహా రౌడీయిజం కొనసాగిందన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం ద్వారా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తోందని, పోలీసులను పూర్తిగా రాజకీయ తొత్తులుగా మార్చుకున్నారని విమర్శించారు.

Next Story