సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. నాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయ పోరాటమా..?

by Bhoopathi Nagaiah |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Former minister Tanniru Harish Rao) బహిరంగ లేఖ రాశారు.

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. నాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయ పోరాటమా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Former minister Tanniru Harish Rao) బహిరంగ లేఖ రాశారు. లేఖలో వివరాలు... ఆనాడు మీరు నిరాహారదీక్ష చేపట్టిన సమయంలో మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలి. నిరాహారదీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయ పోరాటమా.. అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) కూలిపోయిందని.. కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శలు చేసి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ (Mallanna Sagar Reservoir)నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ (Hyderabad) తరలించేందుకు టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిసింది. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) సారధ్యంలోని ప్రభుత్వంలో భూనిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు గుర్తు చేశారు. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని మిగిలిన 10 పనులను పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన వారికి, ప్యాకేజీ మిస్ అయిన వారికి, వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి పరిహారం అందించాలని లేఖలో కోరారు.

పునరావాస కాలనీలకు మహర్దశ పట్టిస్తారని.. నాడు దీక్ష సందర్భంలో చెప్పినట్లుగా ఇంకా ఎక్కువ పరిహారం చెల్లించాలని నిర్వాసితుల పక్షాన హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి.. అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్యలకు దూరంగా ఉండటం విడ్డూరంగా ఉంది. మల్లన్న సాగర్ నిర్వాసితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. మీ నిర్ణయం కోసం మల్లన్నసాగర్ నిర్వాసితులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారని లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు.

Next Story