- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయండి.. జలశక్తి శాఖ కార్యదర్శికి మంత్రి ఉత్తమ్ లేఖ
కృష్ణ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ నీటి పారుదల అంశాలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ నీటి పారుదల అంశాలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖను రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బోజ్జా శనివారం న్యూఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీ.ఎల్. కాంతారావు, కేంద్ర జలశక్తి కమిషన్ (CWC) చైర్మన్ అనుపమ్ ప్రసాద్‌కు అందజేశారు. తెలంగాణ రైతుల హితాన్ని దృష్టిలో ఉంచుకుని, కృష్ణ-గోదావరి బేసిన్లలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, క్లియరెన్సులు వేగంగా మంజూరు చేయాలని మంత్రి తన లేఖలో స్పష్టంగా విజ్ఞప్తి చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీల నీటి వినియోగంతో తొలి దశ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ త్వరితగతిన పరిశీలించి అనుమతించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం వల్ల వెనుకబడిన ప్రాంతాల రైతులకు లభించాల్సిన ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయని, ప్రాజెక్టు ఖర్చులు పెరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్
సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్‌పై సీడబ్ల్యూసీ ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ క్లియరెన్స్ ఇంకా పెండింగ్‌లో ఉందని, ఇప్పటికే సమర్పించిన వివరణలను పరిశీలించి త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జల వివాద ట్రైబ్యునల్–2
కృష్ణ నదీ జలాల పంపకాలపై తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణను వేగవంతం చేసి తుది అవార్డు ప్రకటించేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు. అలా జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు సులభతరం అవుతాయని తెలిపారు.
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘ఫ్లడ్ వాటర్స్’ పేరుతో గోదావరి జలాలను మళ్లించడం చట్టవిరుద్ధమని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీడబ్ల్యూసీ, కేంద్ర సంస్థలు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణమే నిలిపివేయాలని కోరారు.
అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశం..
కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు భూసేకరణ చేపట్టడం సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధమని, దీని వల్ల తెలంగాణకు కృష్ణ జలాల్లో హక్కుగా రావాల్సిన నీటికి ముప్పు ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలను కేంద్రం అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
PMKSY– AIBP కింద ప్రాజెక్టుల అనుమతులివ్వండి..
బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల, నారాయణపేట–కొడంగల్, సీతారామ–సీతమ్మ సాగర్, పాలమూరు–రంగారెడ్డి, ముక్తేశ్వర్ (చిన్న కాళేశ్వరం), మోడికుంటవాగు, చనక కొరటా వంటి ప్రాజెక్టులకు పీఎంకెఎస్‌వై– ఏఐబీపీ పథకం కింద అనుమతులు మంజూరు చేసి కేంద్ర సహాయం అందించాలని మంత్రి కోరారు. ఇవన్నీ కరువు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు కీలకమైన ప్రాజెక్టులని పేర్కొన్నారు. మొత్తంగా, తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకుని, రైతులకు త్వరగా ప్రయోజనాలు అందేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.






