- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెజారిటీ మున్సిపాలిటీల్లో హంగ్ పక్కా.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీల్లో హంగ్ పక్కా అని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత జోస్యం చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీల్లో హంగ్ పక్కా అని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) జోస్యం చెప్పారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బూతు పురాణానికి ఎండ్ కార్డ్ పడి చెవులకు ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసలు సమస్యలను గాలికి వదిలి.. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని కామెంట్ చేశారు. ఈ ప్రచార సరళి చూశాక మున్సిపల్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికల లాగే పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుండు అని అనిపించిందని అన్నారు. మహబూబ్ నగర్ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారని.. కానీ అక్కడ గత రెండు మూడు రోజులుగా మంచినీరు రాని పరిస్థితి ఉందన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు దారుణంగా ఉందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందని కవిత ఆరోపించారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను చూస్తున్నా.. ఏనాడు బస్తీ దవాఖానాలపై రివ్యూ చేయలేదని అన్నారు. అన్నింటికన్నా మేజర్ ఇష్యూ డ్రైనేజీ నిర్వహణ. పట్టణాల్లో చెత్త కుప్పలుకుప్పలుగా పేరుకుపోయి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సవ్యంగా హరీశ్‌రావు పనులు..
ఇక రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని కవిత ఆరోపించారు. కరీంనగర్‌లో ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ఇంటి గేటుకు తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని ఫ్లెక్సీ వేసి నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇప్పటికైనా బుద్ధిజీవులు ఆలోచించి సరైన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే.. ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. అది కూడా సీఎంతో గుంటనక్కకు ఉన్న సంబంధంతో సిద్దిపేటకు మాత్రమే నిధులు మంజూరు కావడం విశేషం అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా.. హరీశ్ రావుకు పనులు అవుతున్నాయని కామెంట్ చేశారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందే..
ఫిబ్రవరి 26న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని కవిత తెలిపారు. ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకునే అవకాశం ఉన్న చివరి బడ్జెట్ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లపై ఎన్నికల ఒత్తిడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో భూములు అమ్మడం ద్వారా రూ.7 వేల కోట్లు సంపాదించుకున్నారని, సంపద సృష్టించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. దీంతో రెవెన్యూ లోటు మైనస్ రూ. 9 వేల కోట్లకు వెళ్లిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా బడ్జెట్‌లో బీసీలకు సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంచుతూ రూ. 35 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టాలన్నారు. పట్టణ ప్రాంత పేద ప్రజలకు 8 లక్షల ఇళ్లకు గాను రూ. 25 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేల ఆర్థిక సాయం అంశాన్ని బడ్జెట్‌లో పెట్టాలన్నారు. కవులు, కళాకారులకు కేంద్రం ఇచ్చే సాయానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.
సీఎం పచ్చి అబద్ధాలు..
రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కవిత మండిపడ్డారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రమ్మన్నా తాము వస్తామని, లేకపోతే నిజామాబాద్‌కు రమ్మన్నా ఓకే అని ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీ కాని రైతులను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌కు తీసుకొస్తామని కవిత స్పష్టం చేశారు.






