తెలంగాణ ప్రభుత్వానికి NGTలో భారీ ఊరట.. మూసీ సుందరీకరణకు లైన్ క్లియర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 07:10:47  IST  )

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) పచ్చజెండా ఊపింది.

తెలంగాణ ప్రభుత్వానికి NGTలో భారీ ఊరట.. మూసీ సుందరీకరణకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తిక్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యూనల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యూనల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

కాగా, హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుమారు రూ.50 వేల కోట్లతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. అయితే, తాజాగా నేషల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ఎస్టీపీ (STP)ల నిర్మాణం, నది పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యామ్‌ల ఏర్పాటు వంటి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story