ఐదు చెరువులు ఖాళీ.. ఇప్పుడు అనంతారంపై కన్ను: ఆగని మట్టి దోపిడీ!

by Gantepaka Srikanth |

నల్లగొండ నియోజకవర్గంలో రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో సాగుతున్న మట్టి దోపిడీపై సర్వత్రా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఐదు చెరువులు ఖాళీ.. ఇప్పుడు అనంతారంపై కన్ను: ఆగని మట్టి దోపిడీ!
X

నల్లగొండ రింగ్ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నాసిరకం మట్టిని ఉపయోగిస్తున్నారని, దీనివల్ల రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు, పాలకుల అండతో కాంట్రాక్టర్ రూ.100కోట్లకు పైగా విలువైన చెరువు మట్టిని అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతా లోపాలపై ఆందోళనకు దిగాలని నేతలపై కార్యకర్తల ఒత్తిడి తెస్తున్నా, కొంతమంది ప్రముఖ నేతలు తెరవెనుక చక్రం తిప్పుతూ అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు చెరువులను ఖాళీ చేసిన కాంట్రాక్టర్, ఇప్పుడు అనంతారం చెరువుపై కన్ను వేసి, మట్టి తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ జరిపి, రోడ్డు నాణ్యతపై బహిరంగ మట్టి పరీక్షలు నిర్వహించాలని పలు పార్టీల నేతలు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ మట్టి దోపిడీ భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కమిటీ నిబంధనలపై సందిగ్ధత ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ నియోజకవర్గంలో రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో సాగుతున్న మట్టి దోపిడీపై సర్వత్రా విస్తృతంగా చర్చ జరుగుతోంది. పట్టణానికి మణిహారంగా నిలవాల్సిన ఈ రోడ్డు పనుల్లో కాంట్రాక్టర్ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని, నాసిరకం పనులు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా, పట్టణానికి చెందిన కొంతమంది అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదు. రూ.100కోట్లకు పైగా విలువైన చెరువు మట్టిని దోచుకుంటూ, నాసిరకంగా రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు, పాలకులు సైతం కాంట్రాక్టర్‌తో అంటకాగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

నేతలపై కార్యకర్తల ఒత్తిడి - తెరవెనుక రాజకీయం

రింగ్ రోడ్డు నిర్మాణానికి రైతుల పొలాలకు ఎరువుగా వాడాల్సిన ఎర్రమట్టి, నల్లమట్టిని ఉపయోగిస్తున్నారని, దీనివల్ల రోడ్డు తొందరగా కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సామాన్య ప్రజలు వద్దని చెబుతున్నప్పటికీ, కాంట్రాక్టర్ మాత్రం లెక్కచేయకుండా నాసిరకం మట్టితోనే పనులు కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాంట్రాక్టర్ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాలని ఓ ప్రధాన పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కార్యకర్తలు తమ నేతలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల కింద జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిని నిలదీసినట్లు సమాచారం. ఆ సందర్భంలో అధ్యక్షుడు ‘గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్‌ను కలవడానికి వంద మంది కార్యకర్తలు, నాయకులు నాతో రాగలరా.. నేను సిద్ధం’ అంటూ సవాల్ విసిరినట్లు తెలిసింది. కానీ, తీరా చూస్తే ఆ నాయకుడు తెల్లారేసరికి పట్టణం దాటి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.

భూగర్భ జలాలకు ముప్పు..

రోడ్డు నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్ ఇప్పటికే మండలంలోని ప్రధానమైన చెరువులను దోచుకున్నారు. ఉదయసముద్రం, రాములబండ, కంచనపల్లి, బుద్ధారం, దోమలపల్లి చెరువుల్లో రూ.100కోట్లకు పైగా విలువైన మట్టిని తవ్వి తన జేబులు నింపుకున్నారని సమాచారం. ఐదు చెరువులను ఖాళీ చేసిన కాంట్రాక్టర్, ఇప్పుడు పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతారం గ్రామ చెరువుపై కన్ను వేశారు. అధికారులు, పాలకుల అండదండలతో ఈ చెరువు మట్టిని కూడా దోచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ‘ఈ మట్టి తవ్వకాల వల్ల కాంట్రాక్టర్ జేబుల్లోకి నోట్ల కట్టలు.. రైతు నోట్లోకి మట్టి పెడ్డలు’ వెళ్లనున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో విచ్చలవిడిగా సాగుతున్న మట్టి తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కమిటీ ఇరిగేషన్, మైనింగ్ నిబంధనలకు లోబడి పని చేస్తుందా? లేక కేవలం నల్లగొండ నియోజకవర్గానికే పరిమితమవుతుందా? లేక జిల్లా మొత్తానికి వర్తిస్తుందా? అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది.

Next Story