TG: రాష్ట్రంలో రసవత్తరంగా స్థానిక పోరు.. తొలి విడత ఫలితాలతో ప్రధాన పార్టీలు అలర్ట్

by Gantepaka Srikanth |

TG: రాష్ట్రంలో రసవత్తరంగా స్థానిక పోరు.. తొలి విడత ఫలితాలతో ప్రధాన పార్టీలు అలర్ట్

TG: రాష్ట్రంలో రసవత్తరంగా స్థానిక పోరు.. తొలి విడత ఫలితాలతో ప్రధాన పార్టీలు అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక పోరు రసవత్తరంగా సాగుతుంది. తొలి విడత సర్పంచ్​ఎన్నికల ఫలితాలతో ప్రధాన పార్టీలు అలర్ట్​అయ్యాయి. అధికార కాంగ్రెస్‌కు సర్పంచ్ స్థానాలు అత్యధికంగానే వచ్చినప్పటికి బీఆర్ఎస్‌కు కూడా కొన్ని స్థానాలు రావడంపై టీపీసీసీ నేతలు రెండూ, మూడో దశ ఎన్నికలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీ ముఖ్య నేతలు ఈ నెల 14, 17 తేదీల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని నేతలతో మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం కష్టపడితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల నేతలకు సూచిస్తున్నారు. రెండో విడత పోలింగ్‌కు మరొక రోజు మాత్రమే ఉన్నందున గెలుపుకోసం మరింత హార్డ్ వర్క్ చేయాలని చెబుతున్నారు. అధికార పార్టీకి సర్పంచ్ స్థానాలు ఎక్కువే వచ్చినప్పటికి, బీఆర్‌ఎస్‌కు ఊహించిన దాని కంటే తక్కువ సీట్లు రావడంతో ఆ పార్టీ నేతలు అలర్ట్​అయ్యారు. తాము మరింత ప్రోత్సహించి ఉండి ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చేవని గులాబీ నేతలు అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. రెండు, మూడు దశల ఎన్నికల్లోని ఆయా ప్రాంత నేతలను ప్రోత్సహించే విధంగా వారు కసరత్తు చేస్తున్నట్లుగా తెలిసింది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలూ మరింత ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంతో ఉన్నారు.

రెండేళ్ల ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలు మరిన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జీలను పార్టీ కీలక నేతలు హెచ్చరించినట్లుగా సమాచారం. గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలువకుండా.. కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడెట్స్ అత్యధిక స్థానాల్లో గెలవాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా తెలిసింది. తాము ఊహించిన దానికన్నా ఫలితాల్లో తేడా వస్తే ఉంటే బాగుండదని మరికొందరికి కొంత ఘాటుగానే క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. అధికార పార్టీకి కింది స్థాయిలోనే కేడర్​బలంగా ఉంటే రాబోయే రోజుల్లో వచ్చే అన్ని ఎన్నికల్లో సులువుగా గెలుపొందే ఆస్కారం ఉంటుందని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వం ద్వారా జరిగే పనులు కాంగ్రెస్​ద్వారా అవుతున్నాయనే విషయాన్ని గ్రామస్థాయిల్లోకి తీసుకెళ్లేది సర్పంచ్​లేనని గుర్తించాలని వారికి చెప్పినట్లు సమాచారం. ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు ఉన్నా, టికెట్ల కేటాయింపుల్లో అసంతృప్తిగా ఉన్న వారిని బుజ్జగించాలని, అదే సమయంలో పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ కాకుండా, అవసరమైతే హస్తం గూటికే చేర్చుకునేలా ప్లాన్ చేసుకోవాలని పార్టీ పెద్దలు స్థానిక నేతలకు చెప్పినట్లుగా తెలిసింది.

రచ్చ గెలిచి ఇంట ఓడిపోయిన ఎమ్మెల్యే‌లు..

రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్న నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు. వెయ్యి, రెండు వేల ఓట్లు ఉన్న సొంత గ్రామంలో మాత్రం గెలువలేక చతికిలపడ్డారు. తమ సొంతూర్లు గెలవలేకపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాలకు మకుటంలేని మహారాజులు వెలుగోతుందున్న శాసనసభ్యులు తమ సొంత గ్రామాల్లో ఓడిపోవడంపై ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సొంత ఊర్లో గెలవలేని వారు ఇక నియోజకవర్గంలో ఎలా పట్టుసాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్​హయాంలో మంత్రులుగా ఒక వెలుగు వెలగిన నేతలు సైతం తమ సొంత గ్రామంలో సర్పంచ్‌ని గెలిపించుకోలేకపోయారు. సంవత్సరాలుగా రాష్ట్ర నేతలుగా గుర్తింపు పొంది నేతలు సైతం సొంత గ్రామంలో బొక్కబోర్లా పడ్డారు. స్థానికంగా ఉండే రాజకీయాలు వేరు.. రాష్ట్ర స్థాయిలో ఉండే రాజకీయాలు వేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత గ్రామంలో ఎమ్మెల్యే చెప్పినా వినని పరిస్థితులు ఉంటాయని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నేతలను కాకుండా తమ కుటుంబ సభ్యులను, కొత్త నేతలను తీసుకొచ్చి పోటీకి పెట్టే సరికి అప్పటి వరకు పనిచేసిన వారు తీవ్ర నిరాశ చెంది స్వతంత్రంగా బరిలో దిగుతున్నారు.

మొదటి విడతలో ఫలితాలు..

మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్​సొంత గ్రామం సోమ్లాతండలో కాంగ్రెస్​అభ్యర్థి ఓటమి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి

షాద్‌నగర్​ఎమ్మెల్యే శంకరయ్య సొంత గ్రామంలో కాంగ్రెస్​అభ్యర్థి ఓటమి

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాదర మండలం బూరుగుపల్లిలో బీఆర్‌ఎస్​ఓటమి

బీఆర్‌ఎస్​మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వగ్రామం వంగపల్లిలో బీఆర్‌ఎస్ ఓటమి

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత ఊరు పర్వతగిరిలో బీఆర్‌ఎస్​ఓటమి

మంథని నియోజకవర్గం దన్వాడ మంత్రి శ్రీధర్‌బాబు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగి‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల సొంత గ్రామం బ్రాహ్మణవెల్లంలలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వగ్రామం తిరుమలగిరి మండలం, తాటిపాములలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సొంతూరు.. ఉరుమడ్లలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సొంత గ్రామం నాగారంలో బీఆర్‌ఎస్​మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్​రెడ్డి స్వగ్రామం శాలిగౌరారం కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఏకగ్రీవం

ప్రభుత్వ విప్​బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మండలం, సైదాపురంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వగ్రామం.. శాలిగౌరారం మండలం, ఊట్కూరు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపు

మొత్తం గ్రామాల సంఖ్య= 4235

కాంగ్రెస్ గెలిచినవి= 2864

బీఆర్ఎస్ గెలిచినవి= 1143

బీజేపీ గెలిచినవి= 185

ఇతరులు= 43

Next Story