ఫైర్ సర్వీసెస్ చట్టంలో భారీ మార్పులు.. అగ్ని ప్రమాదాలకు చెక్

by Malleboina Mahesh |

తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టం 1999కు సవరణలు! ప్రజల నుండి సూచనలు ఆహ్వానిస్తున్న అగ్నిమాపక శాఖ. మే 13 లోపు మీ అభిప్రాయాలను పంపండి.

ఫైర్ సర్వీసెస్ చట్టంలో భారీ మార్పులు.. అగ్ని ప్రమాదాలకు చెక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దశాబ్దాల నాటి నిబంధనలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ‘తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టం 1999’కు భారీ సవరణలు ప్రతిపాదించింది. పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు, మారుతున్న అగ్నిప్రమాద ముప్పు, అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కేవలం చట్టాన్ని సవరించడమే కాకుండా అందులో ప్రజలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదిత ముసాయిదాపై సలహాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

నాలుగు లక్ష్యాలు..

చట్ట సవరణలు వెనుక ప్రధానంగా నాలుగు లక్ష్యాలు ఉన్నాయని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అగ్ని ప్రమాద నివారణ, ప్రాణ రక్షణ చర్యలు చేపట్టడం మొదటి లక్ష్యం కాగా, ఫైర్ ఎన్ఓసీ పొందే ప్రక్రియను మరింత సరళీకరించడం రెండో లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే నిబంధనల అమలులో పారదర్శకత పెంచడం, అధికారుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం ద్వారా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. తద్వారా నగరాలు, పట్టణాల్లో ఎదురవుతున్న అగ్ని ప్రమాద ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకమైన విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ ముసాయిదా సవరణలను బహిరంగ పరిచింది.

సూచనల స్వీకరణ

మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, వివరణాత్మక పత్రాలు ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారిక వెబ్‌సైట్ www.fire.telangana.gov.in తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.telangana.gov.inలో అందుబాటులో ఉంచారు. ప్రజలు, నిపుణులు, సంబంధిత భాగస్వామ్య వర్గాలు ఈ ముసాయిదాను పరిశీలించి తమ అభిప్రాయాలను తెలియజేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కోరారు. మే 13వ తేదీ సాయంత్రం 5గంటల వరకు పంపించవచ్చని స్పష్టం చేశారు. ఈ మెయిల్ కు ఫీడ్‌ బ్యాక్ సైతం పంపించవచ్చు.

నేరుగా లేదా పోస్ట్ ద్వారా కూడా తమ సూచనలను గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడలో ఉన్న ఐఆర్డీఏఐ కాంప్లెక్స్ పక్కన గల అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి పత్రాలను అందజేయొచ్చు. భవన నిర్మాణ రంగ నిపుణులు, అగ్నిమాపక భద్రతా ఏజెన్సీలు, సామాన్యలు సురక్షితమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సవరణలకు తుది రూపం ఇవ్వనున్నారు.

Next Story